calender_icon.png 4 October, 2024 | 4:54 AM

రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్

04-10-2024 02:45:53 AM

కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రైల్వే ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ రైల్వే ఉద్యో గులకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల జీతంగా రూ.2028.57 కోట్లు చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, గార్డులు సహా పలు క్యాటగిరీల ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ పొందే ఉద్యోగుల్లో వివిధ క్యాటగిరీల నాన్ గెజిటెడ్ రైల్వే సిబ్బంది కూడా ఉంటారు. వీరిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు తదితరులు ఉన్నారు. ఈ బోనస్ ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 చెల్లిస్తారు. సాధారణంగా దుర్గాపూజ, దసరా సెలవులకు ముందు కేంద్రం రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ ఉంటుంది.

అయితే, కేంద్రం అందిస్తున్న బోనస్‌పై రైల్వే యూనియన్లు అసంతృప్తిని వ్యక్తే చేశాయి. ఆరో వేతన సంఘం కాకుండా ఏడో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏడో వేతన సంఘం ఆధారంగా కొత్త పే స్కేల్‌కు అనుగుణంగా గరిష్ఠ బోనస్ రూ.46,159 ఉంటుందని ఐఆర్‌ఎస్‌టీఎంయూ ప్రధాన కార్యదర్శి అలోక్ చంద్రప్రకాశ్ తెలిపారు.