బెల్లంపల్లి (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సి అండ్ ఎం డి శ్రీధర్ సింగరేణి నిధులను కెసిఆర్ కుటుంబం పాలించిన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు మళ్లించారని కాంగ్రెస్ నాయకులు మంతెన మల్లేష్ మండిపడ్డారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ప్రాంతాల్లో ప్రజలను మభ్యపెట్టి కార్మికులు, మధ్యతరగతి ప్రజల నుండి వేలాది రూపాయలు దండుకొని పనికిరాని, బ్యాంకు రుణాలు అందని పట్టాలను అందజేశారని విమర్శించారు.
బెల్లంపల్లి ప్రాంతంలో లక్షలాది రూపాయలను పట్టాల కోసం వసూలు చేసి కేవలం మూడు వేల మందికే పనికిరాని పట్టాలు అందించి చేతులు దులుపుకున్నారన్నారు. మరో ఏడు వేల మందికి నేటికీ పట్టాలు అందించలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి ప్రాంతంలో బ్యాంకు రుణాలు అందే విధంగా ప్రతి ఒక్కరికి పట్టాలను అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచనల మేరకు కార్మికులకు నిలిపివేసిన విద్యుత్ ను తిరిగి పునరుద్ధరించిన సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు పొట్లసురేష్, ఎండి గౌస్ లు మాట్లాడుతూ కొంతమంది సింగరేణి అధికారుల వల్ల బెల్లంపల్లి ప్రాంతంలో ని కార్మిక వాడల్లో అధికారులు విద్యుత్ ను నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపులో సింగరేణి కార్మికులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. నిరుపేదలతో పాటు సింగరేణిలో పనిచేసిన రిటైర్డ్ కార్మికులు, ప్రస్తుత కార్మిక కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండి అమానుల్లా ఖాన్, ఎల్తూరి శంకర్, గోమాస ప్రశాంత్, ఆడేపు మహేష్, గజ్జల కృష్ణమోహన్, అల్లం కిషన్, పంబాల వెంకటేష్, ఆడెపు శ్రీనివాస్, ఎస్ కే జానీ తదితరులు పాల్గొన్నారు.