calender_icon.png 25 September, 2024 | 11:55 AM

రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రుల డుమ్మా

25-09-2024 03:39:57 AM

  1. అసంతృప్తి వ్యక్తం చేసిన డీలర్లు
  2. సమస్యలు పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, సెప్టెంబర్ 24: తమ రాష్ట్రస్థాయి సమావేశాలకు వస్తామని చెప్పిన మంత్రులు మొహం చాటేయడంపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం కేంద్రంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సమావేశాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ సమావేశాలను గతనెల 27న నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఇందుకు అనుగు ణంగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహకు ఆహ్వానం అందించగా ఆ సమయంలో తాము అందుబాటులో ఉండమని చెప్పడంతో తిరిగి ఈనెల 24కి సమావేశాలను వాయిదా వేసి సభ ఏర్పా ట్లు పూర్తిచేశారు.

మంత్రులు వస్తారని మధ్యా హ్నం 12 గంటల వరకు వేచి చూసి సమావేశాలు ప్రారంభించారు. స్థానిక శాసన సభ్యులు, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి సభకు హాజరయ్యారు. అయితే సమావేశాలకు ఆహ్వానిం చిన మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాకపోవడంతో..33 జిల్లాల నుంచి హాజరైన డీలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ల ప్రతినిధి మాట్లాడుతూ.. జిల్లా నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించడంతో పాటు ముగ్గురిని మంత్రులుగా చేసి..ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందిస్తే ఒక్కరూ హాజరుకాకపోవడం సిగ్గుగా ఉందన్నారు. రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. సమావేశంలో రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.