calender_icon.png 20 October, 2024 | 5:07 AM

దుల్కర్ ‘ఆకాశంలో ఒక తార’..

29-07-2024 12:05:00 AM

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా ‘ఆకాశంలో ఒక తార’ పేరిట ఓ చిత్రం తెరకెక్కినుంది. జూలై 28న ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థలతో కలిసి లైట్ బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాని నిర్మించనున్నా రు. మహానటి, సీతారామం వంటి చిత్రాలతో తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్న దుల్కర్ నటిస్తున్న ఈ తాజా చిత్రాన్ని  తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు నిర్మాణ వర్గాలు తెలిపాయి. తాజాగా విడుదలైన టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని బట్టి దుల్కర్ కెరీర్‌లో ఇది మరో భిన్నమైన సినిమా కానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియజేయనున్నారు రూపకర్తలు. 

అదృష్ట రేఖపై లక్కీ భాస్కర్

మరోవైపు దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని కూడా ఆదివారం విడుదల చేశారు చిత్ర బృందం. జీవీ ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ ఆలపించారు. “శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా” అంటూ సాధారణ బ్యాంక్ క్యాషియ ర్ అసాధారణ రీతిలో ఎదిగే తీరుని చెబుతూ సాగింది ఈ పాట. ఆ ప్రయాణం ఏమిటన్నది సెప్టెంబర్ 7న తెలియనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు.