04-03-2025 07:08:48 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ(Union Civil Supplies Minister Pralhad Joshi)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర పౌర సరఫరాలశాఖ నుంచి రాష్ట్రానికి బకాయిలు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర సివిల్ సప్లై నుంచి దాదాపు రూ.2 వేల కోట్లు రావాలని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని వెల్లడించారు. పీఎం కుసుమ్ కింద సౌర విద్యుత్ పై సబ్సిడీ, సోలార్ యూనిట్లు, మహిళా సంఘాల కొరకు రాయితీలు కోరామని మంత్రి చెప్పారు. ట్రైబుల్, మారుమూల ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్లు అడిగితే కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కోరారు.