- అదే ఉద్యోగులకు శాపంగా మారింది
- సెప్టెంబర్‌లో హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణ పనులు
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ఉద్యోగులపై ప్రదర్శించిన నిర్లక్ష్యం శాపంగా మారిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్త్తానని, వారి సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీకి సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాలతో మంత్రి భేటీ అయ్యారు.
గత ప్రభుత్వం పదేండ్ల పాటు ఉద్యోగుల సమస్యలపై దృష్టిపెట్టకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిం దని.. నచ్చిన వారికి నజరానాలు.. అన్నట్టు తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు చేసి ఉద్యోగుల మధ్య ఐక్యతకు విఘాతం కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిందనే సంతో షం లేకుండా 317 జీవో ద్వారా ఉద్యోగులకు తీవ్రంగా అన్యాయం చేశారని, భర్త ఆదిలాబాద్‌లో ఉంటే భార్య ఆలంపూర్‌లో ఉంటుందని గత ప్రభుత్వ హయాంలో ఆ విధంగా ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. జోనల్ వ్యవస్థను నాశనం చేశారని, జీవో 46 ద్వారా కొన్ని జిల్లాల్లో ఉద్యోగాల నియామకాలు ఎక్కువ ఉంటే కొన్ని జిల్లాల్లో మరీ తక్కువగా ఉంటున్నాయని తెలిపారు.
సెప్టెంబర్‌లో విజయవాడ హైవే విస్తరణ
సెప్టెంబర్‌లో విజయవాడ హైవే విస్తరణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు. మండలాల మధ్య ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు రుణాలు సైతం తీసుకుని ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖతో అనుసంధానంగా ఉంటూ కేంద్ర నిధులను పెద్ద ఎత్తున తీసుకువచ్చి జాతీయ రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పదేండ్లలో పురోగతి లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందని.. అంతా కష్టపడి రాష్ర్ట ప్రజల్లో శాఖపై సానుకూల ధృక్పథాన్ని కలిగించాలని ఉద్యోగులను కోరారు.
ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాలు, కలెక్టరేట్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస భవనాల నిర్మాణంతో పాటు తెలంగాణను ప్రపంచపటంలో నిలబెట్టే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగు తుందని ఉద్యోగులు రోజు కో గంట ఎక్కువ కష్టపడి పనిచేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని అన్నారు. ఇప్పటికే నాలుగైదు మండ లాలకో ఏఈ ఉన్నారని.. నియామకాలు పెంచితే క్షేత్రస్థాయిలో పనుల్లో నాణ్యత పెరుగుతుంద న్నారు. ఇప్పటికే కొనసాగుతున్న 196 మంది ఏఈఈ/ఏఈల నియామక ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తవుతుందని, మిగితా ఖాళీలను గుర్తించి టీజీఎ స్పీఎస్సీకి పంపేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్‌అండ్ బీ స్పెషల్ సెక్రటరీ హరిచందన, ఈఎన్‌సీ గణపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీఈ మెహన్ నాయక్, రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, పుల్లదాస్, రాజేం ద్రనాయక్ పాల్గొన్నారు.