06-04-2025 03:40:26 PM
పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
కాటారం,(విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తల్లి జయశ్రీ ఆయన సోదరుడు శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు. వారి ఇంటి ఇలవేల్పు శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దుద్దిళ్ళ కుటుంబం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండువగా జరిగింది. ఉదయం నుంచే పచ్చని పందిళ్లు, తోరణాలతో ఊరంతా పందిరి, సీతారాముల పెళ్లి ముస్తాబయింది. శీను బాబు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణాన్ని వారి చేతుల మీదుగా జరిపించారు.
వేద పండితులు మంత్రోచ్చరణాలు గావించగా, జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా, మేళా తాళాల మధ్య రాములోరి పెళ్లి జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్గీయ శ్రీపాద రావు సతీమణి శ్రీమతి జయశ్రీ పూజల్లో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీత రాముల వారి కళ్యాణం తలంబ్రాలను భక్తులు స్వీకరించారు. అన్నప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కనుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది.