calender_icon.png 18 April, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ 2018 ఉపాధ్యాయులకు రెన్యుమరేషన్ చెల్లించాలి

15-04-2025 06:08:11 PM

టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూటారీ రాజు..

భద్రాచలం (విజయక్రాంతి): ఫిబ్రవరి 2025 నెలలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమింపబడిన డీఎస్సీ 2008 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ లో ట్రెజరీ సైట్ లో ఉపాధ్యాయుడి పేరు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో అనుసంధానం చేసి డ్రాయింగ్ ఆఫీసర్లు వారికి రెన్యుమరేషన్ చెల్లింపబడునట్లు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షులు బుటారి రాజు సంబంధిత డ్రాయింగ్ అధికారులకు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు అధ్యక్షతన మంగళవారం  జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో బుటారి రాజు మాట్లాడుతూ టీపీటీఎఫ్ ప్రాతినిధ్యం వలన రాష్ట్ర విద్యాశాఖ, ట్రెజరీ అధికారులు కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెన్యుమరేషన్ చెల్లింపును ట్రెజరీ సైట్ లో ఎనేబుల్ చేయడం జరిగిందని, ట్రెజరీ ఫార్మ్ 58 లో బిల్ చేయాలని తెలిపారు. 

ప్రస్తుత పాలకులు ఎన్నికల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోవడం, సమస్యల పరిష్కారమునకు ఉద్దేశించబడిన మంత్రివర్గ ఉప సంఘం తన విధులను విస్మరించడం, గత ప్రభుత్వం విధానాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం లాంటి చర్యల మూలంగా రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రకటించుకున్న పోరాట కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.

ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులను ఆర్థికంగా కృంగదీస్తున్నారని, భవిష్యత్తు అవసరాలకొరకు తాము పొదుపు చేసుకొని దాచుకున్న సొమ్మును కూడా సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమని అన్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ విద్యారంగం ఉపాధ్యాయుల సమస్యలపై కూడా కార్యచరణ రూపొందించుకొని పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దర్శిని సంపాదకవర్గ సభ్యులు మునిగడప రామాచారి, రాష్ట్ర కౌన్సిలర్ కెచ్చల మాధవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పోలేబోయిన గంగరాజు, సనప కృష్ణబాబు, వాంకుడోత్ సరియా, బూరుగు హనుమంతు లు పాల్గొన్నారు.