calender_icon.png 12 January, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ యథాతథం

09-07-2024 01:03:12 AM

పరీక్షల నిర్వహణకే సర్కారు మొగ్గు

  1. వాయిదా వేయబోమని విద్యాశాఖ స్పష్టం
  2. 11 నుంచి హాల్‌టికెట్లు జారీకి రంగం సిద్ధం
  3. 3 నెలలు వాయిదా కోరుతున్న అభ్యర్థులు
  4. సైఫాబాద్ డీఎస్‌ఈ కార్యాలయం ముట్టడి 

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేసే పరిస్థితి లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. పరీక్షలు యథా తథంగా నిర్వహించి తీరుతామని పేర్కొన్నది. ఓవైపు డీఎస్సీని వాయి దా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు మాత్రం డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లను చేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 11న సాయంత్రం నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది.

ఈమేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నర్సింహారెడ్డి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. డీఎస్సీ నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపడంతో షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఒకవేళ డీఎస్సీని ఇప్పుడు వాయిదా వేస్తే.. మళ్లీ స్లాట్‌లు దొరకడం, షెడ్యూల్ రూపొందించడం కష్టం. ఈ నేపథ్యంలోనే డీఎస్సీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ వేయగా, మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (ఎస్‌జీటీ), స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు.

3 నెలలు వాయిదా వేయాలి..

డీఎస్సీ మూడు నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందు లో భాగంగానే సోమవారం సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాల యం ముట్టడికి యత్నించారు. అభ్యర్థులు కార్యాలయం వద్దకు చేరుకొని డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన తెలిపేందుకు తమకు అవకాశమివ్వాలని ఓ అభ్యర్థి పోలీసు అధికారి కాళ్లు మొక్కి వేడుకున్నాడు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకే నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎలాంటి అరాచకాలకుపాల్పడడేందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని, పరీక్షలను ౩ నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.