calender_icon.png 8 October, 2024 | 5:53 AM

ఈనెల 10 లోపు డీఎస్సీ ఫలితాలు!

04-09-2024 01:39:06 AM

  1. ఏ క్షణమైనా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
  2. కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ

హైదరాబాద్,సెప్టెంబర్ 3(విజయ క్రాంతి): డీఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 10లోపు ఫలితాలను ప్రకటించనున్నారు. దీనికి సం బంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈనెల 5న ఫలితాలు విడుదల చేయాలని ముం దస్తుగా భావించారు. కానీ ఏ చిన్న పొరపాటు జరగకుండా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి.. అంతా సవ్యంగా ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని భావిస్తున్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఫైనల్ కీ, ఫలితాల విడుద ల విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ ఉన్నతాధి కారి తెలిపారు.

ఈ క్రమంలోనే తుది కీ ని పాఠశాల విద్యాశాఖ ఏ క్షణమై నా విడుదల చేసే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి వరకు లేదా బుధవారం కీని విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా డీఎస్సీ ఫైనల్  కీ, ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఆగస్టు 13న ప్రిలిమినరీ కీతో పాటు, రెస్పాన్స్ షీట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి 28 వేలకు పైగా అభ్యంతరాలను స్వీకరించారు. ఫైనల్ కీ తర్వాత డీఎస్సీ, టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్‌ఎల్)ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 1:3 మెరిట్ జాబితా విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్  చేపడతారు. అనంతరం 1:1 ప్రకారం ఫైనల్ లిస్టు విడుదల చేసి మెరిట్ ఉన్న వారికి నియామక పత్రాలు అందజేస్తారు.