calender_icon.png 27 December, 2024 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి డీఎస్సీ

18-07-2024 01:01:06 AM

పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు

హాజరుకానున్న 2.79 లక్షల మంది

రెండు షిఫ్టుల్లో రోజుకు 26 వేల మంది

15 నిమిషాల ముందే గేట్లు మూసివేత

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో దాదాపు ఆరేళ్ల తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ విధానంలో మొదటి సారి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 5వ తేదీవరకు మొత్తం 13 రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 2,79,956 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డీఎస్సీ (టీఆర్టీ) నోటిఫికేషన్ 2017 అక్టోబర్ 21న వేయగా, 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు పరీక్షలు జరిగాయి. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 18 వేల పోస్టులతో ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ జారీ చేయగా, అదే సంవత్సరం ఆగస్టు 27, 28, 29 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత 11,062 టీచర్ పోస్టులకు డీఎస్సీ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

14 జిల్లాల్లో 56 కేందాలు

అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు 14 జిల్లాల్లో మొత్తం 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెషన్‌లో 13 వేల మంది చొప్పున రోజుకు రెండు సెషన్లలో కలిపి మొత్తం 26 వేల మంది పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తం 2,79,956 మంది అభ్యర్థుల్లో బుధవారం సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు తెలిపిన సమాచారం మేరకు 2,48,851 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

15 నిమిషాలు ముందే గేట్లు క్లోజ్

షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. చేతులపై మెహందీ, ఇంకు లాంటివి ఉంటే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబో మని స్పష్టం చేశారు. అదేవిధంగా పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. అందుకే అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సరిచూసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటలవరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు.

అయితే బయోమెట్రిక్ విధానం అమలు దృష్ట్యా ఉదయం సెషన్ అభ్యర్థులకు 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ వారికి 12.30 గంటల నుంచి లోనికి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 8.45 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకే గేట్లు మూసివేయనున్నారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు అభ్యర్థులను బయటికి పంపించరు. గం టన్నర ముందు నుంచే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. హాల్ టికెట్, తగిన ఐడీ కార్డు చూపించి లోనికి వెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, పేపర్లను లోని కి తీసుకెళ్లేందుకు అనుమతిలేదు. పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో పరీక్షా కేంద్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇన్విజిలేటర్‌ను సంప్రదించాలని సూచించారు.

నేడు జరిగే పరీక్షలు

గురువారం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్‌లో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం షిఫ్టులో పీఈటీ హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, కన్నడ మీడియం అభ్యర్థులకు జరగనున్నాయి. ఈ నెల 19న మొదటి, రెండో సెషన్‌లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు ఉంటాయి. ఆగస్టు 5వ తేదీ చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), లాంగ్వేజీ పండిట్ (హిందీ) అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి.

పకడ్బందీగా ఏర్పాట్లు..

డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు పూర్తిచేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు, సీనియర్ హెచ్‌ఎంలతోపాటు ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లలో జరిగిన పొరపాట్లకు అధికారులు సవరించారు.

పరీక్షల షెడ్యూల్ ఇదే

18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. సెకండ్ షిప్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష జరగనుంది. 19న ఎస్జీటీ, 20న ఎస్జీటీ, ఎస్‌ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. 22న ఎస్‌ఏ మ్యాథ్స్, 23న ఎస్జీటీ, 24న ఎస్‌ఏ బయాలాజికల్ సైన్స్, 26న తెలుగు భాషా పండిట్, ఎస్జీటీ, 30న ఎస్‌ఏ సోషల్ స్టడీస్, 31న మొదటి షిప్ట్‌లో ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, రెండో షిప్ట్‌లో ఎస్‌ఏ మ్యాథ్స్, ఆగస్టు 1న మొదటి షిప్ట్‌లో ఎస్జీటీ, రెండో షిప్ట్‌లో ఎస్‌ఏ సోషల్ స్టడీస్, ఆగస్టు 2న లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, సంస్కృతం, ఉర్దూతోపాటు ఎస్‌ఏ మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. ఆగస్టు 5న ఎస్ ఫిజికల్ సైన్స్, లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్ష నిర్వహిస్తారు.

వాయిదా వేయాలని హైకోర్టుకు

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం వాయిదాకు ససేమిరా అంటూ పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కొన్ని రోజులు డీఎస్సీని వాయిదా వేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిపై కోర్టులో విచారణ జరగనుంది.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. పరీక్ష రోజు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
  2. ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసిరావాలి.
  3. హాల్‌టికెట్, ఐడీ కార్డు మర్చిపోకుండా వెంట తెచ్చికోవాలి.
  4. కంప్యూటర్ పనితీరును పరిశీలించి కూర్చున్న తర్వాత అధికారులు ఇచ్చిన సూచనలు పాటించి పరీక్ష రాయాలి.
  5. ఏమైనా సమస్యలుంటే వెంటనే అక్కడి ఇన్విజిలేటర్‌ను సంప్రదించాలి.
  6. ప్రతి ప్రశ్నకు అరమార్కు చొప్పున 80 మార్కులకుగాను 160 ప్రశ్నలు ఉంటాయి.