తేల్చిచెప్పిన హైకోర్టు
కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయలేమని హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది. పరీక్షలు మొదలలైన నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన గడువు ఇవ్వకుండా నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన అశోక్‌తో పాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ 2017లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయిందని, ఆ తరువాత ఏడేళ్లకు మళ్లీ ఇప్పుడు వచ్చిందన్నారు. పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన గడువు ఇవ్వడం ద్వారా నిరుద్యోగులందరూ లబ్ధి పొందుతారని తెలిపారు. దీనికి సంబంధించి ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
పభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2.45 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారన్నారని, గురువారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయని, ఈ రోజు 81.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. కేవలం 10 మంది అభ్యర్థుల కోసం ఇన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రస్తుతం పరీక్షలు రాసిన వారందరిలోనూ అనవసర ఆందోళన ప్రారంభమవుతుందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.