ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ చుక్కాని!
1948 - 2024
- గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి
- డీఎస్ మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
- ఆయన పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు
- నేడు నిజామాబాద్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (76) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంట లకు హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయి నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని డీఎస్ నివాసంలో ఆయన పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ నిజామాబాద్‌లో జరిగే డీఎస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవ్వనున్నారు.
కాంగ్రెస్ జెండా కప్పి నివాళులు
డీఎస్ మృతి వార్తను తెలుసుకుని పీసీసీ బృందం ఆయన ఇంటికి వెళ్లింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి డీఎస్ భౌతికకాయంపై కాంగ్రెస్ జెండాను కప్పి నివాళులర్పించారు. ఆయన మృతదేహంపై కాంగ్రెస్ జెండాను కప్పాలనే డీఎస్ చివరి కోరిక తీరిందని కుటుంబసభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నీరుమున్నీరయ్యారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
డీఎస్ అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని సొంత జిల్లా నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌కు కుటుంబసభ్యులు తరలించారు. అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్‌లోని డీఎస్ సొంత స్థలంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియలకు సీఎం సహా అనేకమంది రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
డీఎస్ మృతి బాధించింది
మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ మృతి నన్ను ఎంతో బాధించింది. ప్రజాసేవకు, పేద ప్రజల సాధికారతకు సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ప్రధాని నరేంద్రమోదీ
తెలంగాణకు తీరనిలోటు
తెలంగాణ ఏర్పాటు కోసం డీఎస్ అవిశ్రాంతంగా పాటుపడ్డారు. సీనియర్ రాజకీయ నేతగా ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారు. డీఎస్ మరణం తెలంగాణకు తీరని లోటు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
డీఎస్ ప్రోత్సాహం మరువలేనిది
డీఎస్‌తో కలిసి శాసనసభలో పనిచేసే అదృష్టం దక్కింది. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. పార్టీలకతీతంగా అందరితో సన్నిహితంగా ఉండేవారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ చెప్పేవారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ సాధనలో డీఎస్ పాత్ర మరువలేనిది
ధర్మపురి శ్రీనివాస్ మరణం బాధాకరం. ఉమ్మడి రాష్ర్ట మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటులో డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిది. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాటుపడేవారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
డీఎస్ ఎంతోమందికి ఆదర్శం
ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలందించారు. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకునిగా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మాజీ సీఎం కేసీఆర్
డీఎస్ గొప్ప నాయకుడు
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గొప్ప నాయకునిగా డీఎస్ ఎదిగారు. సామాన్య స్థాయి నుండి పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థిస్తున్నా.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
డీఎస్‌తో మంచి అనుబంధం..
కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌తో నాకు సుధీర్ఘకాల అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా.
మంత్రి పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్‌కు తీరనిలోటు
డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డీఎస్ ఒకరు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. డీఎస్ మృతిపట్ల వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్‌లో కీలక పాత్ర
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌ది కీలకపాత్ర. సుదీర్ఘకాలం పార్టీకి సేవలు అందించారు. రాజకీయ నాయకులెందరికో ఆయన ఆదర్శం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత
కిందిస్థాయి నుండి ఎదిగిన వ్యక్తి డీఎస్. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన కుమారుడు ఎంపీ అర్వింద్, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఎంపీ ఈటల రాజేందర్
సుదీర్ఘకాలం పార్టీకి సేవ
కాంగ్రెస్‌లో డీఎస్ కీలకపాత్ర పోషించారు. సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారు. ఉద్యమం సమయంలోనూ ప్రత్యేక ముద్ర చాటుకున్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మాజీ మంత్రి జానారెడ్డి
దిగ్భ్రాంతికి లోనయ్యా..
డీఎస్ మరణవార్తతో దిగ్భ్రాంతికి లోనయ్యా. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక ముద్ర చాటుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని కోరుకుంటున్నా.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రానికి విశిష్ట సేవలు
మంత్రిగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలో డీఎస్ విశేష సేవలందించారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
సుదీర్ఘకాలం రాజకీయాలు
డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి. విద్యార్థి దశ నుండి మాకు సన్నిహిత సంబంధం కలిగిన నాయకుడు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
డీఎస్ మంచి నాయకుడు..
డీఎస్ మంచినాయకుడు. మంత్రిగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలోవిశేష సేవలందించారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు
వ్యక్తిగతంగా బాధ కలిగింది..
డీఎస్ మరణం నాకు వ్యక్తిగతంగా బాధను కల్గించింది. సామాన్య కార్యకర్త నుండి అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి రాజకీయాలకు ఆదర్శం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు నా సొంత గ్రామమైన వేల్పూర్‌లో డీఎస్ అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డీఎస్ మరణం నిజామాబాద్ జిల్లా ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలి
డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్న.
మాజీ మంత్రి హరీశ్‌రావు
చాలా బాధాకరం..
డీఎస్ మరణం చాలా బాధాకరం. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎంపీగా విశేష సేవలందించారు. నాటి రాజకీయాల్లో ఆయన ఎంతో కీలకపాత్ర పోషించారు. ఆయన మృతి ప్రజలకు తీరనిలోటు.
మాజీమంత్రి తలసాని
రాజకీయాల్లో అజాతశత్రువు
రాజకీయాల్లో డీఎస్ అజాత శత్రువు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన చనిపోవటం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మాజీ మంత్రి కేటీఆర్
నేటితరానికి ఆదర్శప్రాయుడు
సామాన్య కార్యకర్త నుండి పీసీసీ అధ్యక్షులుగా సుదీర్ఘం కాలంపాటు కాంగ్రెస్‌లో విశిష్ట సేవలు అందించారు. నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
మంత్రి దామోదర రాజనర్సింహా
పార్టీకి తీరనిలోటు
డీఎస్ మృతి చాలా బాధాకరం. ఆయన మరణం పార్టీకి తీరనిలోటు. మాజీ మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. డీఎస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. డీఎస్ ఆత్మకు శాంతికలగాలపి ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
డీఎస్ నాకు రాజకీయ గురువు
డీఎస్ నాకు రాజకీయ గురువు. మెంటార్‌గా ఎంతో ప్రోత్సహించారు. తెలంగాణ ఏర్పాటులో ఎంతో కృషి చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటు.
నేత మధుయాష్కీగౌడ్
నాన్నతో డీఎస్ అనుబంధం మరిచిపోలేనిది
నా తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో డీఎస్‌కు ఉన్న అనుబంధం మరిచిపోలేనిది. డీఎస్ మరణం దిగ్భ్రాంతి కల్గించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
ఉమ్మడి ఏపీకి ఎంతో సేవ
డీఎస్ మరణం చాలా బాధాకరం. ఉమ్మడి ఏపీలో గ్రామీణాభివృద్ధి, విద్యశాఖ మంత్రిగా ఎంతో సేవ చేశారు. ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
డీఎస్ సేవలు చిరస్మరణీయం
ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరనే వార్త జీర్ణించుకోలేము. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
డీఎస్ మృతిపట్ల సీఎం సంతాపం
- అంత్యక్రియలకు ముఖ్యమంత్రి హాజరు
- పలువురు ప్రముఖులు, నేతల నివాళులు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం పార్టీకి సేవలను అందించారన్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక ముద్రను చాటుకున్నారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ చుక్కాని!
- ఏపీ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చెరగని ముద్ర
- రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర
- పార్టీలోనూ, ప్రజల్లోనూ సౌమ్యునిగా, వివాదరహితునిగా పేరు
- గురువు అరుగుల రాజారాం అడుగుజాడల్లో రాజకీయాల్లోకి
- బ్యాంకు ఉద్యోగం వదులుకుని పొలిటికల్‌గా ఎంట్రీ..
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి) : ధర్మపురి శ్రీనివాస్.. అంటే తెలియని వారుంటారేమోగానీ, డీఎస్ అనగానే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ నేతగా అందరికీ గుర్తుకొస్తారు. 20౦4లో కాంగ్రెస్‌ను ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు. పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పార్టీ పగ్గాలను చేపట్టి విజయతీరాలకు చేరారు. నిత్యం కుమ్ములాడుకునే పార్టీ నేతలను, వైఎస్‌ఆర్, రోశయ్య లాంటి మహామహులను ఏకతాటిపైకి తీసుకురావడంలో కృతకృ త్యులు కావడమే కాకుండా జీవన్మరణ పరిస్థితుల్లోని పార్టీని రెండుసార్లు అందలమెక్కి ంచడంలో తనదైన ముద్ర వేసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు చుక్కానిగా నిలిచారు.
పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలు చేసిన ధర్మపురి శ్రీనివాస్(76) అలియాస్ డీఎస్.. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సాధారణ బ్యాంకు క్లర్క్ ఉద్యోగం వదలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగి ఏపీ రాజకీయాలను శాసించారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం పాటుపడ్డారు. డీఎస్‌గా ఉమ్మడి రాష్ట్రాల్లో ముద్రపడిపోయారు.
బ్యాంక్ క్లర్క్ నుంచి అసెంబ్లీకి...
డీఎస్.. బ్యాంకు ఉద్యోగి. సొంతూరు బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు. నిజామాబాద్ వచ్చి స్థిరపడ్డారు. డీఎస్ కాంగ్రెస్ తరఫున విద్యార్థి నాయకుడిగా ప్రయాణం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ అయ్యాక 1974 నుంచి కొన్నేళ్లపాటు బ్యాం కులో క్లర్క్‌గా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత అరుగుల రాజారాం స్ఫూర్తి తో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1982లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీకి శ్రీనివాస్‌కు అవకాశం వచ్చింది. ఆ ఎన్నికలో ఓడిపోయారా యన.
1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ (పట్టణ) స్థానం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే రాష్ర్ట మంత్రివర్గంలో స్థానం కూడా పొందడం విశేషం. ఆ తర్వాత 1998లో ఏపీసీసీ అధ్యక్షుడిగా నియామకయారు. 1999అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సీఎల్పీ ఉప నేతగా, గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో ఏపీసీసీగా రెండోసారి బాధ్యతలు నిర్వహించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ మంత్రిగా పనిచేశారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ తిరిగి కాంగ్రెస్
2015లో ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉండగా... ఆయనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం లభించింది. రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2023లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
సోనియాకు విధేయుడు..
డీఎస్‌కు సోనియా గాంధీ విధేయునిగా పేరుంది. కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, జైపాల్‌రెడ్డితో సన్నిహత సంబంధాలున్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జనార్దన్‌రెడ్డితోనూ మంచి సంబంధాలున్నాయి.
డీఎస్ కుమారుడు రెండుసార్లు ఎంపీ
డీఎస్ 1948 సెప్టెంబరు 27న నిజామాబాద్ వేల్పూరులో జన్మించారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారులు సంజయ్, అర్వింద్ ఉన్నారు. వీరిలో అర్వింద్ నిజామాబాద్ నుంచి వరుసగా ౨ సార్లు ఎంపీగా గెలిచారు. సంజయ్ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు.
ఐ మిస్ యూ డాడీ అంటూ : ఎంపీ అర్వింద్
“అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I will miss you DADDY! నా తండ్రి, నా గురువు, అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకై జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు” అంటూ ధర్మపురి అర్వింద్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టు చేశారు.