06-03-2025 12:00:00 AM
చేర్యాల, మార్చి 5: వేసవి ప్రారంభ దిశలోనే ఉంది. అప్పుడే రైతన్నకు నీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువులు కుంటల్లో నీళ్లు లేక ఎండిపోతున్నాయి. దీంతో బోరు బావులలో నీరు రోజురోజుకు అడుగంటి పోతుంది. వాటి ఆధారంగా వేసిన వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయి. సరైన సమయంలో తడి అందక నేర్రెలు వారుతున్నాయి.
పచ్చటి పైరు కళ్ళముందే ఎండి పోతుంటే రైతన్న గుండె అవిసిపోతుంది. ఏం చేయాలో పాలిపోక దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అడుగంటిన బోర్ బావుల నుండి వచ్చే నీటిని పొదుపుగా వాడుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పొలం తడి ఆరకుండా ఒకవైపు ఒకరోజు, మరోవైపు ఇంకో రోజు ఇలా తడుల మీదనే పంటను బతికించుకోవడానికి పడరాని పాటుపడుతున్నాడు.
అయినా పంట ఎండు ముఖం పట్టడంతో, రైతన్న మనసోప్పక ఉండ బట్ట లేక ట్యాంకర్ ద్వారా నీటిని కొనుగోలు చేసి పంటకు తడులు అందివ్వడానికి సైతం వెనుకాడడం లేదు. కొమురవెల్లి మండలం గురువన్న పేటకు చెందిన రైతు వెంకటేశం తనకు నాలుగెకరాల పొలం ఉంది. తపసు పల్లి రిజర్వాయర్ నీటితో చెరువులు, కుంటలు నింపుతారని భరోసా తోనే ఉన్న పొలం మొత్తం వరి వేశాడు.
ఎండలు ముదరాడంతో గత ఏడు ఎనిమిది రోజుల నుండి బోరు బావి నుంచి నీరు తక్కువ రావడంతో ఆ నీటిని పొదుపుగా వాడి తడుల చొప్పున పొలం పారిస్తున్నాడు. అయినా పంట కు మీరు అందకపోవడంతో పంట ఎండు ముఖం పట్టింది. దీంతో చేసేదేం లేక, ఇంకా దేవాదుల జలాలు వస్తాయన్న నమ్మకం మీద ఒక్కో ట్యాంకర్ కు 2500 నుండి 3000 వరకు ఖర్చు చేసి ట్రాక్టర్ ద్వారా నీటిని తెప్పించి పొలాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇది ఒక వెంకటేశం పరిస్థితే కాదు. చేర్యాల ప్రాంతా రైతుల మొత్తం తపసు పల్లి రిజర్వాయర్ నీటి మీదనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు అడియాశలు కాకముందే చేపట్టాల్సిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నీటి విడుదల కాలయాపన జరగనుండడంతో రైతులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడి ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 540 మీటర్ల ఎత్తులో ఉంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ప్రాంతానికి నీటి కటకట ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తపసు పల్లి రిజర్వాయర్ ను కొమరవెల్లి మండలంలోని తపసు పల్లి లో 0.03 టీఎంసీల నీరు నిలువ సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించారు. దేవాదుల ఎత్తిపోతుల పథకం కింద మోటార్ల ద్వారా పంపింగ్ చేసి ఈ రిజర్వాయర్ ను నింపుతారు.
తద్వారా కొమరవెల్లి, చేర్యాల, దుల్మిట్ట, మద్దూరు మండలాలలోని చెరువులను కాలువల ద్వారా నింపడం జరుగుతుంది.తద్వారా బావులు, బోరు బావులలో భూగర్భ జలాలు పైకొచ్చి బావులాలలో నీరు సమృద్ధిగా ఉంటుంది. వాటి కింద సాగు చేసి పంటలు పండించుకునేవారు. రిజర్వాయర్ నిర్మించిన అప్పటి నుంచి ఇదే విధానం కొనసాగేది.
ఈ నీటి మీదనే ఆధారపడి రైతులు గత పది సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటున్నారు. గతంలో వేసవి ( రబి) సీజన్లో పంటకాలం పూర్తయ్యేసరికి రెండు మూడుసార్లు నీటిని విడుదల చేసేవారు. ఈ సంవత్సరం నాట్లు వేసినప్పటి నుంచి ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వానికి ముందు చూపు కొరవాడడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేసే వారే కరువయ్యారు. ఇక్కడి నాయకులు సమస్యపై ముందుగానే దృష్టి సారిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోతున్నారు.
దేవాదుల ప్రాజెక్టులోని ఆపరేషన్, నిర్వహణ డిపార్ట్మెంట్ వారు తమకు రావలసిన బకాయల కోసం 15 రోజులు సమ్మెకు దిగారు. దీంతో పంపింగ్ ఆగిపోయింది. నీటి విడుదలకు జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిసింది. దీంతో గత నాలుగైదు రోజుల నుండి పంపింగ్ ప్రారంభమై రిజర్వాయర్లకు నీటి విడుదల జరుగుతుంది.
దేవాదుల రెండో పేజ్ కు సంబంధించి ధర్మసాగరం_ గండిరామారం రెండో మోటర్ ఆన్ చేస్తేనే ఇక్కడి రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపింగ్ వేగం పెంచి రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపిన తర్వాతనే నీటిని విడుదల చేయాలి. లేనట్లయితే గ్రామాల మధ్య లొల్లులు జరిగే అవకాశం ఉంది. ఆలస్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రమాదగంటికలు మోగి, కరువు విలయతాంవడం చేసే పరిస్థితులు రావచ్చు.
నీరు రాకపోవడంతో పంట ఎండిపోయింది
మూడెకరాలలో వరి పంట వేసాము.రెండు ఎకరాలు ఎండిపోయింది. ఇంకో ఎకరం తడులు పెట్టి పారిస్తున్నాం. చేతికి వస్తుందో రాదు తెల్వదు. ఎకరానికి 30000 దాకా పెట్టుబడి పెట్టాం. కూరగాయల సాగు కోసం 8000 పెట్టుబడి పెట్టాము. పంట చేతికి రాకముందే తోటంతా ఎండిపోయింది. బాయి కాడికి పోబుద్ధిగాక మల్లన్న గుడి వద్ద పూలదండల అమ్మడానికి వస్తున్నానని తెలిపారు.
పిట్టల లక్ష్మి, కడవేరుగు, చేర్యాల మండలం