- పడిపోతున్న భూగర్భ జలాలు
- ఆయకట్టు సాగు ప్రశార్థకం
- ఆందోళనలో రైతాంగం
మంచిర్యాల/ కామారెడ్డి, జూలై 12 (విజయక్రాంతి): వర్షాలు లేక గోదావరిపై ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. గడిచిన పదేండ్లలో మొట్టమొదటిసారి నీటిమట్టం తగ్గింది. ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని 330 గ్రామాలతో పాటు ఆరు మున్సిపాలిటీలకు 23 క్యూసెక్కుల తాగునీరు అందుతుంది. అలాగే జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్) తాగునీటి అవసరాలకు 308 క్యూసెక్కులు, రామగుండం గ్రిడ్‌కు 58 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 242 క్యూసెక్కుల నీరు అవసరమవతుంది.
ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో ఈప్రాంతంలో భూగర్భ జలాలు సైతం పాతాళానికి పడిపోతున్నాయి. గతేడాది వరకు ర్యాలీ వాగు, నీల్వాయి వాగు, గొల్ల వాగులతోపాటు సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోవడం, మరోవైపు కడెం ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు లేవు.
ఈ ప్రభావం ప్రాజెక్టుపై పడి ఇప్పుడు డెడ్ స్టోరేజీ (4 టీఎంసీలు)కి చేరుకున్నది. ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో అధికారులు ఒక కెనాల్‌ను తీసి ఇంటెక్‌వెల్స్ వైపు నీటిని మళ్లించారు. తద్వారా తాగునీరు సరఫరా చేశారు. జిల్లాలో 20 శాతం లోటు వర్షపాతమే ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 265.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 213.6 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదైంది. తొలకరి జల్లులకు పత్తి విత్తనాలు నాటిన రైతులు, వరి నారుమళ్లు వేసిన వారు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
బోసిపోతున్న ‘నిజాంసాగర్’
కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ లేకపోవడంతో బోసిపోతున్నది. మూడు టీఎంసీల నీటి నిల్వతో డెడ్‌స్టోరేజీకి దగ్గరపడింది. ప్రాజెక్ట్‌పై ఆధారపడి రైతులు 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నీటిపారుదల అధికారులు ఒక విడత నీటిని విడుదల చేయడంతో రైతులు వరి నాట్లు వేసుకున్నారు. పంటలు చేతికి రావాలంటే కనీసం ఆరు విడతల్లోనైనా నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రాజెక్ట్‌లో నిల్వ ఉన్న 3 టీఎంసీల్లో 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంంచి, మిగిలిన 2 టీఎంసీల నీటిని రెండో విడతగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక మూడో విడత సంగతి ఏమిమనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లను మళ్లించి, ఆయకట్టును గట్టెక్కిస్తామని యంత్రాంగం, ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నప్పటికీ.. ఆ హామీ ఎంతవరకు నెరవేరుతుందో అర్థం కానీ పరిస్థితి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీని వాస్‌రెడ్డి ఇప్పటికే సాగునీటి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో.. పంటలను ఎలా రక్షిస్తారో.. అని రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
నాట్లు వేయలేదు
నేను వరి సాగు చేసేందుకు నాలుగు ఎకరాలను దున్ని సిద్ధంగా ఉంచాను. నారుమడిలో నారు పెరుగుతున్నది. కానీ వర్షాల జాడ లేకపోవడంతో నాటు వేయాలంటే భయంగా ఉంది. దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తేనే రైతులు పంటలు పండిస్తారు. లేకపోతే ఇక అంతే సంగతులు.
-గొల్ల రాజు, రైతు, నర్వ గ్రామం, కామారెడ్డి జిల్లా
భగవంతుడిపైనే భారం..
నిజాంసాగర్ ఆయకట్టు కింద నాకు ఎకరా పొలం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు ఆగిపోయింది. వర్షాలు బాగా కురిసి ప్రాజెక్టులోకి నీరు చేరతుందుని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం కాళేశ్వరం నీటిని తీసుకువచ్చి ఆయకట్టుకు నీరు అందిస్తుందని చెప్తున్నప్పటికీ, ఇక దేవుడిపైనే భారం.
-రాములు, రైతు, బూర్గుల్ గ్రామం, కామారెడ్డి జిల్లా