calender_icon.png 27 October, 2024 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగి వాహనం నడిపితే జైలుకే

01-08-2024 04:16:22 AM

  1. నగరవ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 
  2. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సిటీ ట్రాఫిక్ పోలీసులు 
  3. 6 నెలల్లో 51,213 మందుబాబులపై కేసులు 
  4. గతేడాదితో పోల్చితే 34 శాతం పెరుగుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): మద్యం తాగి వాహనం నడిపి తే ఇక నుంచి జైలుకే పంపుతామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేసినట్లు నగర ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో అంతే వేగంతో పార్టీ కల్చర్ విస్తరిస్తోంది. పార్టీలు, వేడుకల పేరిట ఫుల్‌గా మద్యం తాగిన కొందరు ఆకతాయి లు రోడ్లపై వాహనాలు నడుపుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. పోలీసులకు పట్టుబడతామనే భయం, పట్టుబడితే కేసు లు నమోదవుతాయనే ఆందోళన వారిలో కనిపించడం లేదనే చెప్పాలి. వీరి నిర్లక్ష్యం కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకొ ని అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 

హిట్ అండ్ రన్ కేసుల్లో పట్టుబడితే మర్డర్ చేయడంతో సమానమని, దానికి అనుగుణంగా శిక్షలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాది మొదటి ఆరు నెలల కాలం లో 34,553 మంది పట్టుబడితే, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 51, 213 మందుబాబులు పట్టుబడ్డారు. అంటే గతేడాదితో పోల్చితే 34 శాతం పైగా కేసులు నమో దు చేసినట్లు డీసీపీ తెలిపారు.

హిట్ అండ్ రన్‌లో పదేళ్ల జైలు..

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదు అవుతున్నాయి. మద్యం మత్తులో ఎవరి మృతి కైనా కారణమైతే జూన్ నెల వరకు 304 పార్ట్ 2 ఐపీసీ కింద కేసులు నమోదు చేసేవారు. ఆయా కేసుల్లో వాహనదారులకు న్యాయస్థానం గరిష్ఠంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేది. కానీ, జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) సెక్ష న్ 105 కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కొత్త చట్టంతో మందుబాబులకు గరిష్ఠం గా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

తనిఖీల్లో పట్టుబడితే..

ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం తాగి మొదటిసారి పట్టుబడితే కేసు నమోదు చేసి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. రెండోసారి పట్టుబ డితే జరిమానాతో పాటు వారం రోజుల జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తున్నారు. మూడోసారి పట్టుబడితే కేసు తీవ్రతను బట్టి 6 నెలల నుంచి జీవితకాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఒక నెల నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ బేగంపేట, గోషామహాల్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

మందుబాబులను కట్టడి చేయడమే లక్ష్యం.. 

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూ ర్, రాయదుర్గం ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఆయా ఏరియాల్లో బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌లు ఎక్కువగా ఉం డటం వలన ఆకతాయిలు అర్ధరాత్రుళ్ల వరకు మందుతాగి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మద్యం సేవించి తనిఖీల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచి, మందుబాబులను కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. 

 రాహుల్ హెగ్డే, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ