డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన ౫౧౩మంది మందుబాబులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి) : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 513 మందుబాబులు పట్టుబడ్డారు.
ఇందులో 425 మంది ద్విచక్ర వాహనదారులు, 24 మంది ఆటో డ్రైవర్లు, 60 కారు డ్రైవర్లు, నలుగురు హెవీ వెహికిల్ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 64 మందికి పరీక్షల్లో బీఏసీ (బ్లడ్ అల్కహాల్ కాంటెంట్) 200 నుంచి 550 శాతం వరకు వచ్చింది. పట్టుబడిన వారందరినీ సోమవారం కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
డ్రంకన్ డ్రైవ్‌లో ప్రమాదాలకు కారణ మైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని, ఈ నేరానికి గానూ 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు.