calender_icon.png 27 October, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.1.08 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

13-08-2024 02:38:39 AM

  1. రిసీవర్ కోసం పెద్దఅంబర్‌పేటలో ఎదురుచూపు 
  2. ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు

ఎల్బీనగర్, ఆగస్టు 12: సుమారు రూ.1.08 కోట్ల విలువైన 13.5 కిలోల హషిష్ ఆయిల్‌ను సోమవారం హయత్‌నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు. రాచకొండ ప్రధాన కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఏపీలోని విశాఖపట్నం మాడుగుల మండలం లవ్వసింగి పంచాయతీకి చెందిన వంచుర్బా కొండబాబు(30), వంచుర్బా బాలకృష్ణ(20) బంధువులు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ సరఫరాదారులుగా మారారు. ఏపీతోపాటు ఒడిశా నుంచి హషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు బెంగళూరు, హైదరాబాద్‌లో అమ్ముతున్నారు.

ఈ క్రమంలో ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నవరంలోని ఒకరితో పాటు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆ వ్యక్తి బంధువును తమ ముఠాలో చేర్చుకున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ, కొండబాబుకు 14 కిలోల హషిష్ ఆయిల్ కావాలని అర్డర్ వచ్చింది. దీంతో తమ గ్రామానికి సమీపంలో చడూరు మామిడికొండలు వద్ద 14 కిలోల హషిష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి, హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుకు ఈ నెల 11న సాయంత్రం వచ్చారు. స్థానికంగా ఉన్న ఒక హోటల్ వద్ద రిసీవర్ కోసం ఎదురు చూస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న హయత్‌నగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్వో టీ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రిసీవర్ పరారీలో ఉన్నాడు. వారి నుంచి 13.5 కిలోల హషిష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు, రూ.2వేల నగదు, ప్యాకింగ్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిలో హషిష్ ఆయిల్ తయారు చేయాలంటే సుమారు 30 నుంచి 40 కిలోల గంజాయిని ఉపయోగిస్తారు. 13.5 కిలోల హషిష్ ఆయిల్‌ను తయారు చేయాలంటే సుమారు 560 కిలోల గంజాయిని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 13.5 కిలోల హషిష్ ఆయిల్ ధర మార్కెట్‌లో సుమారు రూ.1.08 కోట్లు ఉంటుందన్నారు. సీపీ వెంట ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.