calender_icon.png 15 November, 2024 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివారు కళాశాలలకు డ్రగ్స్ మరక

04-08-2024 02:30:22 AM

  1. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల వినియోగం
  2. ఇటీవల డ్రగ్స్ తీసుకుంటూ నార్కోటిక్ అధికారులకు పట్టుబడిన విద్యార్థులు
  3. కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకం

రంగారెడ్డి, ఆగస్టు 3 (విజయక్రాంతి): నగరంలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా చాపకింద నీరులా యువతను, విద్యార్థులను చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోతున్నారు. సిటీ శివారు ప్రాంతాల ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు డ్రగ్స్ మరక అంటుకుంటోంది. మాదక ద్రవ్యాల వినియోగంలో పట్టుబడుతున్న వారిలో ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండడం కలవరం కలిగిస్తోంది.

భావి ఇంజినీర్లుగా ఉన్నత స్థానంలో నిలవాల్సిన విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నార్కోటిక్ బృందం ఆకస్మిక దాడులు చేయడంతో డ్రగ్స్‌ను వినియోగిస్తూ పలువురు విద్యార్థులు పట్టుబడ్డారు. దీంతో ఇంజినీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనే పలు కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో వందలాది ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు వెలిశాయి. అందులో పేరుగాంచిన కళాశాలలు సైతం ఉన్నాయి. ఇందులో దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. దీంతో డ్రగ్స్ దందాను కొనసాగించే వారంతా కళాశాలలను టార్గెట్‌గా చేసుకున్నారు.

విస్తృత దాడులు.. 

సిటీ శివారు కళాశాలల్లో డ్రగ్స్, గంజాయిపై సివిల్, ఎస్‌వోటీ బృందాలు నిఘా పెడుతూ దాడులు నిర్వహిస్తున్నా విక్రయాలు ఆగడం లేదు. దీంతో నేరుగా నార్కోటిక్ బృందాలు రంగంలోకి దిగి కొరడా ఝులిపిస్తున్నాయి. అనుమానాలు ఉన్న శివారు ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, వసతి గృహాలు, పాన్‌షాప్‌లు, బార్లు, టీ కేంద్రాలు, హోటళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఆకస్మికంగా దాడులు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవల పలు ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు పట్టుబడ్డారు. డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుంటూ డ్రగ్స్ సరఫరాకు కళ్లెం వేసే పనిలో నిమగ్నమయ్యారు. 

పట్టింపులేని యాజమాన్యాలు..

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన కళాశాలల యాజమాన్యాలు తమ ధర్మాన్ని విస్మరిస్తున్నాయి. తమ కళాశాలలో చేరిన వారు ఫీజులు కడితే చాలు, మిగతాది తమకేమీ పట్టదన్నట్టుగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడం గమనార్హం. ఇదే తమకు అనుకూలంగా మార్చుకున్న కొన్ని డ్రగ్స్ ముఠాలు ఇంజినీరింగ్ కాలేజీలను వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటున్నాయి.  

అవగాహన కల్పిస్తున్నా.. 

మత్తు పదార్థాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఇటీవల పట్టుబడిన పలువురు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలోనే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 

విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి

మాదక ద్రవ్యాలను విక్రయించినా, వాటిని వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాం. శివారు ప్రాంతాల్లోని అన్ని విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సామాజిక వేత్తలతో ప్రత్యేకంగా కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు శ్రమిస్తున్నాం. విద్యార్థులు డ్రగ్స్ బారినపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకొవద్దు.  

 సునీతారెడ్డి, డీసీపీ, మహేశ్వరం