- యువతను వాటి నుంచి ఎక్సైజ్ సిబ్బంది కాపాడాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
రాజేంద్రనగర్, జనవరి 31 : మాదకద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను అరికట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆక్మసిక తనిఖీ చేశారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, అబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ ఉన్నారు.
అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు, ఇతర అధికారులు మంత్రి జూపల్లికి స్వాగతం పలికారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ ఆవరణలో కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మంది మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యక్షంగా మాట్లాడారు. శిక్షణ తరగతుల్లో బోధిస్తున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు.
అకాడమీలో భోజనం ఎలా ఉందని, నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని.. మీరంతా ఎంతో కష్టపడి, స్వయంకృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు.
సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటిబారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదని అన్నారు. ఎక్సైజ్ అకాడమీలో సౌకర్యాలు బాగున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.