29-03-2025 12:17:36 AM
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): నగరంలోని నాంపల్లి, మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ పోలీసులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో రూ.1.70లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై అంథేరీ నుంచి వచ్చిన రంజాన్ అనే వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇఫ్రాన్, అన్వర్ అనే వ్యక్తులకు డ్రగ్స్ ఇస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఆ ముగ్గురిని సీఐ చంద్రశేఖర్‌గౌడ్, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 24.10గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లిఖిత్, హరికృష్ణ అనే వ్యక్తులు బెంగుళూరు నుంచి తీసుకువచ్చి విక్రయిస్తుండగా 3.39గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.