హీరోయిన్ రకుల్‌ప్రీత్ సోదరుడు కూడా..
- అదుపులో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, 13 మంది యూజర్స్
- 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం
- రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడి
రాజేంద్రనగర్, జూలై 15 (విజయక్రాంతి): హైదరాబాద్ పోలీసులు మరో భారీ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఐదుగురు డ్రగ్ డీలర్లు, ౧౩ మంది వినియోగదారులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ విశాల్‌నగర్ ఉన్న జనాబ్ పోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నంబర్ 202లో సోదాలు నిర్వహించారు. అందులో ఉన్న డ్రగ్స్ పెడ్లర్లను, వినియోగదారులను అరెస్టు చేశారు.
వారి నుంచి రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్, 2 పాస్‌పోర్టులు, 2 ద్విచక్ర వాహనాలు, 10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. వినియోగదారుల్లో ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్‌సింగ్ కూడా ఉన్నట్టు చెప్పారు. పట్టుబడినవారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అమన్‌కు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్లలో నైజీరియా దేశస్థులు ఒనుహ బ్లెసింగ్ అలియాస్ జోనా గోమ్స్ అలియాస్ డాన్ గోమ్స్ (31), అజీజ్ నోహిమ్ అడెషోలా (29), విశాఖపట్నంకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ (31), తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన సనబోయిన వరుణ్‌కుమార్ (42), రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ షరీఫ్ (36)లు ఉన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులైర నైజీరియా దేశస్థులు డేవిన్ ఎబుకా సుజీ అలియాస్ ఎబుకా అలియాస్ ఇమ్మాన్యుల్ అలియాస్ లెవల్ (35), ఎజోనైలి ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కాలేషి (22) పరారీలో ఉన్నారు. వారి ఆచూకీ తెలిపినవారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించారు. పట్టుబడ్డ డ్రగ్స్ వినియోగదారుల్లో అమన్ ప్రీత్ సింగ్, కిషన్ రాఠి, అనికేత్, యశ్వంత్, రోహిత్, శ్రీచరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్, మధు, రఘు, కృష్ణంరాజు, వెంకట్ ఉన్నట్టు డీసీపీ వెల్లడించారు. వీరిలో ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
డ్రగ్ పెడ్లర్లపై నిఘా పెంచిన టీజీఏఎన్‌బీ
నగరంలో డ్రగ్స్ దందాను పూర్తిగా నిర్మూలించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) తీవ్రంగా కృషి చేస్తోంది. విమానాశ్రయాలు వంటి ప్రముఖ ప్రదేశాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ పాత నేరస్థులపై నిఘా పెంచింది. ఈ క్రమంలో నైజీరియా దేశస్థులు ఒనుహ బ్లెసింగ్ తరచూ హైదరాబాద్‌కు రావడంపై పోలీసులు నిఘా పెట్టారు. ఈమె గతంలో గోషామహల్ పీఎస్‌లో మాదకద్రవ్యాల కేసులో అరెస్టు ప్రస్తుతం బెయిల్‌పై ఉంది. దేశం వదిలి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో వారి నుంచి తప్పించు కోవడానికి, తమ దేశానికి వెళ్లడానికి వీలుగా నకిలీ చిరునామాతో మరో పాస్‌పోర్టు తీసుకుంది.
ఈ ముఠాలో కీలక సభ్యుడైన డేవిన్ ఎబుకా సుజీ అలియాస్ ఎబుకా ప్రస్తుతం నైజీరియాకు వెళ్లినట్లు సమాచారం. ఇతను ఒనుహ బ్లెసింగ్‌తో కలిసి భారత్‌లోని ప్రధాన నగరాలకు డ్రగ్ సరఫరా చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. అతడు పంపే డ్రగ్స్‌ను ఒనుహ విమానాలు, రైలు ప్రయాణాల ద్వారా డీలర్లకు సరఫరా చేస్తోంది. ఆమె ఇప్పటివరకు 20సార్లకు పైగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు నైజీరియా దేశస్థుడైన అజీజ్ నోహీమ్ అడెషోలా విద్యార్థి వీసాపై ఇండియాకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ డీడీ సమర్పించి చీటింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 2023లో రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు
వెంకట గౌతమ్ 2020లో డ్రగ్ కేసులో కూకట్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక గ్రాముకు రూ.500 కమీషన్‌గా తీసుకుని నైజీరియన్లు కలేషి, అజీజ్ ద్వారా డ్రగ్ డెలివరీ చేస్తున్నాడు. అతని బ్యాంకు ఖాతాలు హెచ్‌డీఎఫ్‌సీకి రూ.4.4 లక్షలు, ఐసీఐసీఐ ఖాతాకు రూ.3 లక్షలు కమీషన్లుగా అందుకున్నట్లు విచారణలో తేలింది. వెంకట గౌతమ్ కు 5 నెలల క్రితం పెళ్లి కాగా, అతని భార్య బ్యాంకు ఖాతాను వాడుకొని ఆమెకు తెలియకుండా రూ.2.5 లక్షలు కమీషన్ల రూపం లో అందుకున్నాడు.
ఆమెకు డ్రగ్ సరఫరా తో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. అతను అందుకున్న కమీషన్ మొత్తం లెక్కించగా గత 7 నెలల్లో 2.6 కిలోల కొకైన్ సరఫరా చేసినట్లు తేలింది. మరో నిందితుడు వరుణ్‌కుమార్ మొదట్లో కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అల్లం గౌతమ్ దగ్గర డ్రగ్ కొనుగోలు చేస్తున్న మధుతో వరుణ్‌కు పరిచయం ఏర్పడింది. గౌతమ్ ద్వారా డ్రగ్ పెడ్లర్‌గా మారిన వరుణ్ నైజీరియన్ల నుంచి కొకైన్ కొనుగోలు చేసి విక్రయించడం ప్రారంభించాడు.
రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్టు
తాజాగా పట్టుబడిన అంతర్జాతీయ డ్రగ్ ముఠాలో అరెస్టయిన వారిలో ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. పోలీసులు నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో అతడికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు