06-04-2025 12:10:06 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 5(విజయక్రాంతి): పుట్టింది ఇండియాలో పెరిగింది అమెరికాలో.. ప్రస్తుతం బేగంపేట్‌లో నివాసం. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. డ్రగ్స్ తీసుకునే స్థాయి నుంచి డ్రగ్స్ విక్రయించే వ్యక్తిగా ఎదిగాడు. అతడు పేరు తేజస్ కట్ట (29) అమెరికా పౌరసత్వం ఉంది.
ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట ఏడాది ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లాడు. అక్కడి పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ.. కొడుకు బేగంపేట్ లో.. తల్లిదండ్రులు మరోచోట హైదరాబాదులో నివాసముంటున్నా రు. హైదరాబాద్ కంటే ముందు తేజస్ కట్ట రెండేళ్ల పాటు ముంబైలో ఉండి ఉద్యోగం చేశాడు. అప్పుడు డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు.
అనంతరం ముంబై నుంచి హైదరా బాద్ వచ్చి ఇక్కడ రీగాక్స్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్‌తో పాటు సోహెల్ అహ్మద్ (29) అనే వ్యక్తి కూడా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. వీరిద్దరు కలిసి డ్రగ్స్ అమ్మకానికి దిగారు. ప్రతి 15 రోజులకు ఒకమారు ముంబైకి వెళ్లి ఈ ఇద్దరు చెరస్, ఎల్‌ఎస్‌డి బ్లాస్ట్, ఓ జి కుష్ లాంటి డ్రగ్స్‌ను తీసుకువచ్చి హైదరాబాదులోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతున్నారు.
విశ్వసనీయ సమాచారం అందుకు న్న ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తన సిబ్బందితో కలిసి ఇద్దరిని సన్ సిటీ ప్రాంతంలో పట్టుకున్నారు. 21 గ్రాముల ఓ జి కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్ ఎస్ డి బ్లాస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు నిందితుల వద్ద రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 2.75 లక్షలు గా ఉంటుందని అంచనా.
డ్రగ్స్ తో పాటు ఒక కారు, ఇద్దరు వ్యక్తులు తేజస్ కట్టా, సోహెల్ మహమ్మద్‌ను అరెస్టు చేసి శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్‌టిఎఫ్‌టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకున్నటువంటి టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి శనివారం అభినందించారు.