calender_icon.png 31 October, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేరాఫ్ పబ్స్

08-07-2024 12:33:59 AM

‘ది కేవ్ బార్ అండ్ లాంజ్’లో పోలీసుల సోదాలు 

24 మందికి డ్రగ్ పాజిటివ్ 

పట్టుబడినవారిలో ఎక్కువమంది టెకీలే

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల సరఫరాతో పాటు వినియోగాన్ని నిర్మూలించేందుకు పోలీస్‌శాఖ పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నది. యువత చెడుమార్గం పట్టకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. కానీ అక్ర మార్కులు ఏదో ఒక విధంగా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఒకరిద్దరైనా డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. పబ్స్‌లో యువత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు దాడులు చేస్తున్నారు.

దీనిలో భాగంగా శనివారం రాత్రి ఖాజాగూడలోని ఓ పబ్‌లో కొందరు డ్రగ్స్ తీసు కుంటున్నారనే సమాచారం అందుకుని రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. మొత్తం 55 మందిని అదుపు లోకి తీసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఖాజాగూడలోని ‘ది కేవ్ బార్ అండ్ లాంజ్’లో శనివారం రాత్రి ‘ఫారెస్ట్ ఆల్కెమీ’ థీమ్‌తో పార్టీ ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వాత కొందరు డ్రగ్స్ తీసుకుంటున్నా రు. రాయదుర్గం పోలీసులు సమాచారం అందుకుని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ), ఎస్వోటీ సిబ్బందితో కలిసి పబ్‌లో దాడు లు నిర్వహించారు. పార్టీకి వచ్చిన 55 మందితో పాటు డీజేలు అబ్దుల్ ఆయూబ్, గౌరంగ్, పబ్ సహ మేనేజర్ ఆర్.శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నా రు. వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ తేలింది.

సామాన్యులు వినలేనంత హై పిచ్ మ్యూజిక్

పార్టీకి హాజరయ్యే వారందరికీ ఇన్‌స్టాగ్రాం ద్వారా ముందుగానే ఆహ్వానం అందుతుందని, అందుకు నిర్వాహకులు కోడ్ భాష వాడతారని డీసీపీ వినీత్ తెలిపారు. ఇదే కోవలో ‘ది కేవ్ బార్ అండ్ లాంజ్’లో శనివారం రాత్రి ‘ఫారెస్ట్ సైకడాలిక్ థీం’ పేరుతో పార్టీ జరిగిందన్నారు. పార్టీకి బయట నుంచే డ్రగ్స్ తీసుకుని రావాల్సి ఉంటుందని నిర్వాహకులు సూచించారన్నారు. పబ్స్‌లో డీజే లు సైకడాలిక్ థీంలో ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌ను హైపిచ్‌లో పెడతారని, డ్రగ్స్ తీసుకున్న వారు మాత్రమే ఆ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయగలరని తెలిపారు.

సామాన్యుల అంత డెసిబెల్స్ శబ్ధాన్ని వినలేరని తెలిపారు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది టెకీలేనని వెల్లడించారు. వారికి డ్రగ్స్, గంజా యి వంటి మత్తు పదార్థాలను ఎవరు సరఫరా చేశారనే కోణంలో విచారణ చేపడుతు న్నామన్నారు. పబ్ యాజమానులు నలుగురు కాగా వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. డ్రగ్ పాజిటివ్ వచ్చిన 24 మందిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశామన్నారు. త్వరలో పబ్‌ను సైతం సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని మిగతా పబ్‌ల్లోనూ దాడులు చేస్తామని,  డ్రగ్స్ వినియోగించేవారు, సరఫరా చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుందని తేల్చిచెప్పారు.