calender_icon.png 20 September, 2024 | 6:19 PM

డ్రగ్స్ భూతం

17-07-2024 12:05:00 AM

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో గంజాయి, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా సాగుతున్నది. నిత్యం నగరంలో ఎక్కడో ఒకచోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కట్టడికి పోలీసులు యుద్ధమే చేస్తున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు. రెండు రోజుల క్రితం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడంతో మరో అంతర్జాతీయ రాకెట్ గుట్టురట్టయింది. పోలీసుల దాడిలో లక్షల విలువైన కొకైన్, ఇతర మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.

నైజీరియా నుంచి విద్యార్థిగా వచ్చిన ఓ మహిళ నగరంలోని డ్రగ్ పెడ్లర్లకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఆ మహిళతోపాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారినుంచి డ్రగ్స్ కొంటున్న 13 మందిని గుర్తించారు. సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్‌సహా ధనిక కుటుంబాలకు చెందిన ఆరుగురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా నగరంలో అనేక సందర్భాల్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గంజాయి, డ్రగ్స్ వినియోగంలో దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 3.1 శాతం మంది అంటే 6.4 లక్షలకుపైగా మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. గతంలో పబ్‌లు డ్రగ్స్‌కు కేంద్రాలుగా ఉండగా ఇప్పుడు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు లాంటివారూ వీటికి బానిసలు అవుతున్నారు. ఇటీవల టీనేజర్లలోనూ డ్రగ్స్ వినియోగం కేసులు పట్టుబడుతున్నాయి. తాజాగా హైస్కూలు స్థాయి విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాల్లో ఇవి సులభంగా లభిస్తున్నాయి.

సంపన్నుల కుటుంబాల్లో పిల్లలపట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టక పోవడం, పాకెట్ మనీ పేరుతో విచ్చలవిడిగా డబ్బు అందుబాటులో ఉండడం టీనేజర్లు ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారడానికి కారణమవుతున్నట్టు నిపుణులు అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సమాజంపై దీని దుష్ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్ నియంత్రణకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గంజాయి, డ్రగ్స్ కట్టడికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. తాజాగా హైస్కూల్ స్థాయిలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు టీచర్లు, తల్లిదండ్రులు, పోలీసులు, విద్యార్థులతో కలిసి ‘ప్రహరీ క్లబ్’లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నగరంలోకి డ్రగ్స్ ముఖ్యంగా గోవా, బెంగళూరు, ముంబయి నగరాలతోపాటు నైజీరియా వంటి ఆఫ్రికా దేశాలనుంచి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోవాకు పెద్దసంఖ్యలో విదేశీయులు వస్తుండడం ఈ దందాకు వరంగా మారింది.

ఆఫ్రికా దేశాలనుంచి డ్రగ్స్‌ను తెస్తున్న ముఠాలు అక్కడి నుంచి బెంగళూరు మీదుగా నగరానికి తరలిస్తున్నారు. పబ్‌లలో పనిచేసే డీజేలు తరచూ గోవా, బెంగళూరుకు వెళ్తూ ఉండడంతో అక్కడి డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఏర్పర్చుకుని  వాటిని నగరానికి తెస్తున్నారు. ఇటీవల ‘ది కేవ్’ పబ్‌లో డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా పార్టీ నిర్వహించారు. ఇందులో కీలక పాత్ర పోషించింది ఓ డీజే కావడం గమనార్హం.

భారీ ఎత్తున దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకొంటున్నా, డ్రగ్స్ పెడ్లర్స్‌ను అరెస్టు చేస్తున్నా కేసుల్లో శిక్షలు పడడం మాత్రం తక్కువే. పైగా ఈ దందాలో లక్షల మొత్తంలో ఆదాయం ఉండడంతో కొందరు దీన్ని ఓ వ్యాపారంగా చేసుకుంటున్నారు. పట్టుబడిన వారికి కఠిన శిక్షలు పడితే కొంతమేరకైనా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై జరిపే ఈ యుద్ధం నిర్విఘ్నంగా సాగి రాష్ట్రం డ్రగ్స్ రహితం కావాలని ఆశిద్దాం.