- హత్యలు, ఇతర నేరాల వెనుక గంజాయి ప్రభావం
- సైబర్ క్రైమ్, డ్రగ్స్ నివారణలో సమర్థంగా పనిచేస్తే ప్రమోషన్లు
- సమస్యలపై అవగాహనకు చిత్ర పరిశ్రమ ముందుకురావాలి
- సామాజిక బాధ్యత చాటుకున్న సినీ హీరో చిరంజీవి
- సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంస
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టీజీ న్యాబ్‌కు వాహనాల అందజేత
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు హత్య, లైంగికదాడులు పెద్ద నేరాలుగా ఉండేవని, హత్యతో ఒకరే చనిపోతారని, మాదక ద్రవ్యాల ప్రభావంతో ఒక తరం పనికిరాకుండాపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 బైకులు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు (టీజీ న్యాబ్) 27 కార్లు, 59 బైకులను ప్రభుత్వం కేటాయించింది.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం ఆ వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ.. 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది విద్యార్థులు, ఉద్యమకారుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. ఉద్యమాలకు చిరునామా అయిన తెలంగాణలో డ్రగ్స్ మాట వినిపించకూడదని పోలీసులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గంజాయి వినియోగం గల్లీల్లోకి చేరిందని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే కాకుండా పేదలు సైతం గంజాయికి బానిసలు అవుతున్నారని చెప్పారు. ఇటీవల హత్యలు, చిన్న పిల్లలపై దాడులకు కారణమైన వారిని పరిశీలిస్తే, అత్యధికులు గంజా యికి బానిసలైనవారేనని తేలిందన్నారు.
నేరగాళ్లను మించిన సాంకేతికత..
నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారని, వారిని ఎదుర్కో వాలంటే అంతకుమించిన సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సైబర్ మోసాలు, నేరాల బారిన పడినవారికి సహాయం అందించేందుకు 1930 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కొద్ది కాలంలోనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూ.31 కోట్లను నేరగాళ్ల నుంచి రాబట్టి బాధితులకు అందజేసిందని చెప్పారు.
అందులో భాగస్వాములైన సిబ్బందికి అభినందనలు తెలిపారు. గతంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరాటం చేసిన వారికి, ఆ నేరాలు అరికట్టిన వారికి ప్రమోషన్లు ఇచ్చేవారని.. ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరాను అరికట్టడంలో సమర్థంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకున్న వారిని, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరాను అడ్డుకున్న వారికి ప్రమోషన్లు కల్పించే విధివిధానాలు తయారు చేయాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. దానిపై అసెంబ్లీలో చర్చించి సంబంధిత చట్టం చేస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు
ప్రదర్శిస్తేనే టిక్కెట్ ధరల పెంపు
డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై ఇటీవల సినీ నటుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపారని, ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తు న్నట్టు సీఎం తెలిపారు. చిరంజీవిని ఇతర నటులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు ఆ తారాగణంతో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించే వీడియోలను ఉచితంగా ప్రదర్శించాలని స్పష్టంచేశారు. థియేటర్లలోనూ ఈ రెండు రకాల వీడియోలను ఉచితంగా ప్రదర్శించాలని యజమా నులకు సూచించారు. సినిమా రూ.వందల కోట్ల పెట్టుబడితో చేసే వ్యాపారమని, వారి వ్యాపారాన్ని తాము కాదనమని, అదంతా ప్రజల నుంచి వచ్చేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
సినిమా విడుదలకు ముందు డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఇతర అనుమతులు ఇస్తామని తేల్చిచెప్పారు. మీడియా సైతం రాజకీయ వివాదాలపై కాకుండా సామాజిక సమస్యలపైనా దృష్టిసారించాలని హితవు పలికారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై టీవీలు, పత్రికల్లో అప్పుడప్పుడు ఉచితంగా ప్రకటనలు వేయాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ఈ అంశాన్ని పరిగణించాలని కోరారు. కార్యక్రమంలో సీఎం రాజకీయ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బీ శివధర్‌రెడ్డి, టీజీ న్యాబ్ డీజీ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.