ఇదే పోలీస్ శాఖ లక్ష్యం: డీజీపీ జితేందర్
- ఈ ఏడాది 9.87% పెరిగిన నేరాలు
- 2,34,158 కేసులు నమోదు
- సైబర్ క్రైమ్ కేసుల్లో 43.33% పెరుగుదల
- డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రం
- దేశంలోనే మొదటిసారి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐకి లేఖ రాశాం
- వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత తెలంగాణే పోలీసు శాఖ లక్ష్యమని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,942 డ్రగ్స్ కేసులు నమోదు చేసి, 4,682 మందిని అరెస్ట్ చేశామని, రూ.142.95 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశామని వివరిం చారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు.
గతే డాది మొత్తం 2,13,121 కేసులు నమోదు కాగా, ఈసారి 2,34,158 కేసులు నమోద య్యాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రవ్యా ప్తంగా నమోదైన కేసుల వివరాలతో 2024 వార్షిక నివేదికను ఆదివారం డీజీపీ విడు దల చేశారు. డీజీపీ కార్యాలయంలోని కాన్ఫ రెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయల్, సందీప్ శాండిల్య, విక్రమ్ సింగ్‌మాన్, మహేశ్ భగవత్, సుధీర్‌బాబు తదితరులతో కలిసి వివరాలు వెల్లడించారు.
‘డిజిటల్ యుగంలో పిల్లలను సురక్షితంగా ఎలా ఉంచాలి’ అని తల్లిదండ్రులకు వివరి స్తూ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వికారాబాద్, జైనూర్ వంటి ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తుతో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు, పండుగలు శాంతియుతంగా జరిగాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి తీసుకున్నామని వెల్లడించారు.
డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రం
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా డయల్ 100 కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయని డీజీపీ వెల్లడించారు. డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నూతన నేర చట్టాల అమ లు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 85,190 కేసులు నమోదు కాగా, ఇందులో సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదు చేశామన్నారు.
దీంతోపాటు మరో 1,313 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏడాది 547 ఎస్సైలు, 12,338 మంది కానిస్టేబుళ్లను నియమించామని చెప్పారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 38,231 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్టు తెలిపారు. షీ టీమ్స్‌కు 10,862 ఫిర్యాదులు రాగా, 830 ఎఫ్‌ఐఆర్‌లు, 3,329 పెట్టీ కేసులు నమోదు చేశామని, 15,664 మందికి కౌన్సెలింగ్ నిర్వహించామని వెల్లడించారు.
ప్రజల రక్షణకే ట్రాఫిక్ విభాగం
హైదరాబాద్‌లో ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టామని, కేవలం చలానాల కోసమే ట్రాఫిక్ యంత్రాంగం పనిచేయ డం లేదని డీజీపీ చెప్పారు. ఒకవేళ ట్రాఫిక్ చలానాలు విధించకపోతే వాహనదారుల్లో భయం అనేది ఉండదన్నారు. అప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు.
గతంలో 4 శాతం వాహనదారులు మాత్రమే హెల్మెట్ ధరించేవారని, కానీ, ప్రస్తుతం 80 శాతానికి పైగా వాహనదారులు హెల్మెట్ ధరిస్తున్నారని వివరించారు. ప్రజల రక్షణ కోసమే ట్రాఫిక్ విభాగం పనిచేస్తుంటుందని చెప్పారు. ఈ ఏడాది 20,702 రోడ్డు ప్రమాదాలు జరగగా, 6,541 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
అల్లు అర్జున్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది
వ్యక్తిగతంగా లేదా కుటుంబసమస్యలతో పోలీసుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. చిన్నాచితకా మినహా పోలీ సు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతో ందని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ రాశామని చెప్పారు. నిందితులను విదేశాల నుంచి ఇండియాకు రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఉంటుందని, ఇందుకు ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటున్నామని వివరించారు.
కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తీసుకురావడానికి సమయం పడుతుందని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్‌లో రూ.247 కోట్లు ఫ్రీజ్
ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా, 41 మంది సరెండర్ అయినట్టు డీజీపీ తెలిపారు. సైబర్ క్రైమ్‌లో కూడా ఈ ఏడాది 43.33 శాతం పెరుగుదల నమోదైందని చెప్పారు. గతేడాది 17,571 కేసు లు నమోదు కాగా, ఈసారి 25,184 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. బాధితు లకు రూ.180 కోట్లు రీఫండ్ చేశామని, మరో రూ.247 కోట్లను ఫ్రీజ్ చేశామని తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న 14,984 సిమ్‌కార్డులు, 9,811 ఐఎంఈఐ, 1825 వెబ్ సైట్ యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసినట్టు చెప్పారు.