* ఎస్సై, సిబ్బంది పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడి
* ఇక ఫోరెనిక్స్ ల్యాబ్ రిపోర్టులే ఆధారం
* ఆత్మహత్యలపై పోలీసుల దర్యాప్తు వేగవంతం
* మొబైల్ డీకోడింగ్‌తో వివరాల సేకరణకు కసరత్తు
కామారెడ్డి,డిసెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు పోలీసుల ఆత్మహత్యల మిస్టరీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురూ నీటిలో మునిగే మృతిచెందినట్టు ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్‌లో తెలిసింది. ముగ్గురి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో తేలింది.
అయితే ముగ్గురు ఒకేసారి చనిపోయారా? లేదా? ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్లి మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారా? లేదా శృతి, నిఖిల్‌లు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
శనివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద పోలీసులు రీకన్‌స్ట్రక్షన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలు త్వరగా కనుగోనాలని ఎస్పీ సింధూ శర్మను డీజీపీ ఆదేశించారు. మృతుల సెల్‌ఫోన్ చాటింగ్‌ను ఢీకోడింగ్ చేయాలని సూచించినట్టు తెలిసింది. మృతుడు ఎస్సై సాయికుమార్ స్వగ్రామం మెదక్ జిల్లా కొల్చారంలో ప్రత్యేక పోలీస్ బృందం వివరాలు సేకరించినట్టు సమాచారం.
బీబీపే టలో నిఖిల్ కుటుంబం, గాంధారిలో ఉన్న శృతి కుటుంబాన్ని సైతం ప్రత్యేక బృందం విచారించిన్టు తెలిసింది. ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా ముగ్గురి ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇద్దరం కలిసి చనిపోదాం.. శృతి, నిఖిల్ చాటింగ్ వెలుగులోకి
ప్రత్యేక పోలీస్ బృందం విచారణ చేపట్టిన నేపథ్యంలో పోలీసులు భిక్కనూర్ పీఎస్ నుంచి చెరువు వరకు ఉన్న సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ముగ్గురి కాల్‌డాటా, వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 1.26 నిమిషాలకు ముగ్గురి ఫోన్లు స్విచాఫ్ అయినట్టు గుర్తించారు. చాటింగ్‌లో నిఖిల్, శృతి మధ్య ఆత్మహత్య గురించి చర్చ జరిగినట్టు బయటపడింది. ‘
నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే.. నేను చేసుకుంటానని, లేదా ఇద్దరం కలిసి చేసుకుందాం’ అంటూ చాటింగ్ చేసినట్టు తెలిసింది.
ఎస్సైకి సంబంధించిన మూడు సెల్‌ఫోన్లలో ఒకటి అన్‌లాక్ అయింది. మరోవైపు ఆర్థిక అంశాల కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ముగ్గురి బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరో ౩ రోజుల్లో ముగ్గురి మృతి మిస్టరీ చేధించనున్నట్టు పోలీసులు ధీమాగా ఉన్నారు.