calender_icon.png 7 March, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాడలేని పశు బీమా!

07-03-2025 12:00:00 AM

పాడి రైతులకు కరువైన ధీమా

మృత్యువాత పడుతున్న పశువులు

నష్టపోతున్న అన్నదాతలు

ఆరేళ్ళుగా పథకానికి మంగళం

పునరుద్దరించాలని రైతుల విజ్ఞప్తి

మెదక్, మార్చి 6(విజయక్రాంతి): మెదక్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వ్యవసాయంతో పాటు రైతులు పాడి పశువుల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పాడి పశువులు ఏదైనా ప్రమాదం సంభవించి మృత్యువాత పడితే రైతులకు నష్టం వాటిల్లితే గతంలో పశుబీమా ఉండేది. ప్రస్తుతం పశు బీమా నిలిచిపోవడంతో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశు పెంపకం ఆధారపడిన వారు పశువులు విద్యుదాఘాతంతోనో, ఇతర అనారోగ్య సమస్యలతోనే చనిపోతే ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మేలు రకం జాతి పశువుల కొనుగోలుకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ప్రమాదాల బారిన పడి పాడి పశువులు చనిపోతే రైతులు ఆర్థిక భారంతో కుదేలవుతున్నారు. 

ఆరేళ్ళుగా నిలిచిన పథకం...

పశు బీమా పథకం గత ఆరు సంవత్సరాలుగా  నిలిచిపోయింది. 2017-18 వరకు పాడి పశువులకు బీమా పథకం అమలైంది. తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వ్యవసాయం, పాడి పరిశ్రమే ప్రధాన ఆధారం. ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమయంలో పాడి  పశువులు ఎన్నో మృత్యువాత పడ్డాయి. దీంతో రూ.లక్షలు వెచ్చించి పశువులు కొనుగోలు చేసిన పాడి రైతులు బీమా సౌకర్యం లేక ఆర్థికంగా చతికిల పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పశుబీమా సౌకర్యం పునరుద్దరించాలని పాడి రైతులు కోరుతున్నారు. 

సుమారుగా 40వేల లీటర్ల పాల ఉత్పత్తి...

వ్యవసాయంతో పాటు రైతులు పాడి పశువులను సైతం సాకుతున్నారు. తక్కువ భూమి ఉన్న రైతులు పాడి  రంగాన్ని ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,77,000 వరకు పశువులుండగా, గేదెలు 1,22,000 వరకు ఉంటాయి. ఆవులు సుమారుగా 54 వేల వరకు ఉంటాయి. జిల్లాలోని 21 మండలాల్లో సుమారుగా 40వేల లీటర్లకు పైగా పాలను రైతులు అందిస్తున్నారు. కానీ పాడినే నమ్ముకున్న రైతులకు బీమా సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. 

ప్రభుత్వ పరిశీలనలో ఉంది...

ప్రస్తుతం పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం అందుబాటులో లేదు. ఆరు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తగిన బడ్జెట్ లేకపోవడంతో బీమా సౌకర్యం కల్పించడం లేదు. అయితే రైతులు ప్రైవేట్గా బీమా చేసుకోవడం జరుగుతుంది. బీమా సౌకర్యం కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే సమాచారంఅందిస్తాం.

 వెంకటయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, మెదక్