calender_icon.png 15 January, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాలో డ్రోన్ సర్వే

02-07-2024 06:10:16 AM

  • ప్రాపర్టీ ట్యాక్స్ పెంపుపై ప్రత్యేక కసరత్తు 
  • పైలట్ ప్రాజెక్ట్‌గా మియాపూర్, ఆర్‌సీ పురం  
  • త్వరలో జీఐఎస్ యాప్‌లో వివరాల నమోదు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో ఎగవేతదారుల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) సర్వే ప్రారంభించింది. ఈ మేరకు డ్రోన్లతో నిర్మాణాల చిత్రీకరణ ప్రక్రియను ప్రారంభించారు. గ్రేటర్‌లో ట్యాక్స్ వసూలు పెంచుకోవడంలో భాగంగా జీఐఎస్ సర్వే చేపట్టాలని బల్దియా కొన్నేళ్ల క్రితమే అనుకున్నా పలు కారణాలతో వాయిదా పడింది. జీహెచ్‌ఎంసీ పూర్వపు కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రత్యేక చొరవతో మళ్లీ ఈ ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ముందుగా పైలజ్ ప్రాజెక్టుగా మియాపూర్, ఆర్‌సీ పురం ప్రాంతంలో డ్రోన్లతో భవనాల చిత్రీకరణ చేస్తున్నారు. 

మియాపూర్, ఆర్సీ పురంలో ప్రారంభం.. 

గ్రేటర్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాలలో మొత్తం 19 లక్షల భవనాలు ఉన్నాయి. వీటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. 2022 వార్షికంలో రూ. 1,660 కోట్ల ఆదాయం, 2023 రూ. 1,915 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా చాలా నిర్మాణాలు ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్లలో కమర్షియల్ కేటగిరీలో ఉంటూ, జీహెచ్‌ఎంసీలో మాత్రం రెసిడెన్షియల్ కేటగిరీలో ఉంటున్నట్టుగా అధికారులు చాలా ఏళ్ల క్రితమే గుర్తించారు. దీంతో బల్దియాలో భవనాలను పక్కా లెక్కించేందుకు ప్రత్యేక కసరత్తు చేపడుతూనే ఉన్నారు.

జీఐఎస్ సర్వే ద్వారా ట్యాక్స్ ఎగవేతదారులను గుర్తించి, వారి నుంచి కూడా సక్రమంగా ట్యాక్స్ వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. దీంతో జీఐఎస్ సర్వేను ఎంచుకున్నప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఇటీవలనే కమిషనర్‌గా బదిలీపై వెళ్లిన రోనాల్డ్ రాస్ చొరవతో మరోసారి జీఐఎస్ ఎజెండా తెరపైకి వచ్చింది. మొత్తానికి జీఐఎస్ ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో పైలట్ ప్రాజెక్టుగా మియాపూర్, ఆర్సీ పురం ప్రాంతాల నివాసాలపై డ్రోన్ కెమెరాలు తిరుగుతూ అక్కడి ఆస్తుల చిత్రీకరణ చేపడుతున్నాయి. ఈ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా రాండమ్ పద్ధతిలో చేపడుతున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. 

త్వరలో ఇంటింటి సర్వే.. 

ప్రాపర్టీ ట్యాక్స్ భవనాలను పక్కాగా లెక్కించేందుకు ఒక వైపు డ్రోన్ కెమెరాలతో పాటు మరో వైపు జీఐఎస్ యాప్ ద్వారా ఇంటింటి సర్వే కూడా చేపట్టాల్సి ఉంది. వాస్తవానికి ఈ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఈ యాప్‌లో కొన్ని మార్పులు, చేర్పులు కారణంగా ఆలస్యమైనట్టుగా అధికారులు చెబుతున్నారు. మొత్తం ప్రక్రియ పూర్తవ్వగానే ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ విభాగాలలోని కమర్షియల్ నివాసాలన్నింటినీ జీహెచ్‌ఎంసీలోనూ కమర్షియల్‌గా మార్చనున్నారు. దీంతో అదనంగా మరో రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల ఆదాయం ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో పెరగనున్నట్టుగా అధికారుల అంచనా.