calender_icon.png 29 November, 2024 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్ టాక్సీ సేవల్లోకి డ్రోగో డ్రోన్స్

18-05-2024 02:03:31 AM

డీజీసీఏ అనుమతులకు దరఖాస్తు

క్రిషి డ్రోన్‌కు గ్రీన్ సిగ్నల్

30లక్షల ఎకరాల్లో మందుల  పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం 

జిల్లా, మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ 

డ్రోగో కంపెనీ సీఈవో యశ్వంత్ బొంతు

హైదరాబాద్, మే 17 ( విజయక్రాంతి): ఎయిర్ టాక్సీతో పాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తాము భవిష్యత్ ప్రణాళికలను రూపొందించినట్లు డ్రోగో డ్రోన్స్ సీఈఓ యశ్వంత్ బొంతు వెల్లడించారు. వ్యవసాయరంగంలో విస్తృతమైన సేవలు అందించే క్రిషి డ్రోన్‌కు పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతులు ఇచ్చినట్లు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. దేశవ్యాప్తంగా 30లక్షల ఎకరాల్లో   క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇఫ్కోతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. సర్వే, మ్యాపింగ్, ఉత్పత్తుల రవాణా మరికొన్ని ఇతర రంగాలకు డ్రోగో డ్రోన్స్ సేవలను విస్తరిస్తామని తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, ఆ తరువాత మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు యశ్వంత్ వివరించారు.

డ్రోగో డ్రోన్స్ తాజాగా తయారు చేసిన క్రిషి డ్రోన్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే నాలుగు ఎకరాల్లో క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తుందని యశ్వంత్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు దేశంలో ఉన్న డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు ఎకరాల్లో మాత్రమే మందులను పిచికారీ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని వెల్లడించారు. క్రిషి డ్రోన్‌తో రోజుకు 30 నుంచి 35 ఎకరాల్లో  మందులను పిచికారీ చేయటంతో పాటు రైతులు 80శాతం అధిక దిగుబడి పెంచుకునే అవకాశం ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో రైతులు తమ డ్రోన్ సేవలు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు తాము పెట్టుబడులు పెట్టామని, ఇందుకోసం 1,000 మందికి శిక్షణ ఇస్తామని య శ్వంత్ వెల్లడించారు. డ్రోగో డ్రోన్స్ సేవలకు ఏఐ సాంకేతితకను జోడిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.