calender_icon.png 27 December, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో కారు డ్రైవింగ్

18-09-2024 03:48:15 AM

  1. ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతి
  2. ఐదుగురికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): మద్యం మత్తులో కారును నడిపి ఆటోను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం వద్ద మంగళవారం జరిగింది. ములకలపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్వంచలోని పలు ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేందుకు ఆటోలో వెళ్తుంటారు.

మంగళవారం పాఠశాల ముగిసిన తర్వాత ఓ ఆటోలో విద్యార్థులు ములకలపల్లికి బయలుదేరారు. సీతారాంపురం వద్ద ములకలపల్లి నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వస్తూ ఆటోను ఢీ కొట్టింది. వికే రామవరం గ్రామానికి చెందిన విద్యార్థి రచ్చ ఈశ్వర్(12) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వర్ పాల్వంచ డీఏవీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

అతడి అన్న యశ్వంత్‌తో పాటు సుబ్బనపల్లికి చెందిన అటికేటి తేజక్షిత్, అటిగేటి సాత్విక, వికే రామవరానికి చెందిన కుంజా మోక్షిత్ రాజు, పూసుగూడెంకు చెదిన ఆటో డ్రైవర్ అటిగేటి ప్రవీణ్  తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో యశ్వంత్, సాత్విక, డ్రైవర్ ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. డ్రైవర్ మినహా క్షతగాత్రులంతా 12 సంవత్సరాలు లోపు వారే.  కారు డ్రైవర్ మద్యం మత్తులో నడపడం వలనే ప్రమాదం చోటుచేసుకున్నదని, కారులో మద్యం సీసాలు ఉన్నాయని ప్రతక్ష్య సాక్షులు చెబుతున్నారు. ములకలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.