02-03-2025 12:00:00 AM
వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని చాలామంది నిరూపించారు. నిజానికి సాధన కు, సాహసానికి వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదు. అందుకే కేరళకు చెందిన రాధా మణియమ్మ 11 డ్రైవింగ్ లైసెన్లు పొందిన మహిళగా గుర్తింపు పొందింది. కార్లు, జేసీబీలు, భారీ క్రేన్లు నడిపి విజయవంతమైన మహిళగా పేరు తెచ్చుకున్నారు.
74 ఏళ్ల రాధా మణియమ్మ తన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇతరుల కంటే ఉన్నతంగా చదువాలని కలలు కన్నారు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో విద్యకు దూరం కావాల్సివచ్చింది. అయితే పరిస్థితు లను సాకుగా చూపి ఆమె అక్కడితోనే ఆగిపోలేదు. తనకు డ్రైవింగ్ అంటే ఇష్టమని తెలుసుకొని ఆ వైపు అడుగులు వేసింది. ఆ విషయం భర్తతో పంచుకుంది. భర్త సాయంతో కారు నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్‌ను 1981లో పొందింది.
ఆ తర్వాత 1984లో దేశంలో ‘హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందిన మొదటి మహిళగానూ నిలిచింది. అయితే వాహనాలకు కావాల్సిన పరికరాలను అమ్ముతూనే, భారీ వాహనాలను ఎలా నడపాలో నేర్చుకుంది. అంతేకాదు.. చాలామందికి లైసెన్లు పొందడానికి సాయం చేసింది. 2004లో తన భర్త మరణించిన తర్వాత రాధ అనేక సమస్యలను ఎదుర్కొంది. పురుషాధిక్యత ఎక్కువగా వ్యాపారంలో రాణించి ఆడవాళ్లు ఏదైనా చేయగలరని నిరూపించింది. ‘
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ స్థానం సంపాదించుకుంది. 2022లో రాధా మణియమ్మ ‘ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా అందుకుంది. రాధా మణియమ్మకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. దాదాపు 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె కేవలం 11 లైసెన్లు పొందడమే కాదు.. ట్రాన్స్‌పోర్ట్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగి తనలాంటి మహిళలకు అండగా నిలుస్తోంది.