calender_icon.png 24 October, 2024 | 5:02 AM

ట్రైనింగ్ ఇవ్వకుండానే వోల్వో బస్సులకు డ్రైవర్లు

24-10-2024 02:45:46 AM

ఆర్టీసీ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): వోల్వో, ఇతర అత్యాధునిక బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వకపోవడంపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. డ్రైవర్లకు తగిన శిక్షణ ఇవ్వకుండానే ఆ బస్సులను నడిపేందుకు ఎలా అనుమతిస్తారని ఆర్టీసీ యాజమాన్యాన్ని నిలదీసింది.

అగ్రిమెంట్లో శిక్షణ తప్పనిసరి కూడా ఉందని, దీనిని ఎందుకు అమలు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆర్టీసీని ఆదేశించింది. తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది.

రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, వోల్వో అండ్ ఐషర్ గ్రూప్ సీఈవోలు కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ, చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వోల్వో, ఇతర అత్యాధునిక బస్సులను నడిపేందుకు సుశిక్షితులైన డ్రైవర్లను నియమించేలా ఆర్టీసీకి ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రకాశం జిల్లా, పేర్నమిట్టకు చెందిన మేడికొండ జార్జ్ వేసిన అప్పీల్‌పై విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది.