హైదరాబాద్: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడు ఈర్ల కృష్ణ బాబును అరెస్ట్ చేశారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డయల్ 100కు ఫోన్ చేసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూ పీఎస్ సమీపంలో బస్సును ఆపి సీజ్ చేశారు. ఈ ఘటనపై ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి బుధవారం వివరాలను వెల్లడించారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణ బాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశాం.
చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్ధయ్య బస్సు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో కృష్ణ బాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సిద్ధయ్య అతడికి సహకరించాడు. మంగళవారం నిందితులు ఇద్దరిని యాచారం పీఎస్ పరిధిలో అదుపులోకి తీసుకుని వారిపై 64 (1) బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడు అని డీసీపీ పేర్కొన్నారు.