జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వేసవిలో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్ ను ప్రత్యేక డ్రైవ్‌పై మండల స్థాయి సమావేశాలను నిర్వహించి, రోజు వారీ షెడ్యూల్‌ను రూపొందించి మండల బృందాలను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.
మండల స్థాయిలో ఎంపీడీవో, మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీ సెక్రెటరీలు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడైతే త్రాగునీటి సరఫరాలో సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించి తద్వారా వేసవిలో త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. అన్ని మరమ్మత్తులు, సమస్యలను పరిష్కరించి రానున్న వేసవిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ గ్రామాలలో త్రాగునీటి సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 18005994007 ద్వారా తెలియపరచడం ద్వారా పరిష్కరింపబడతాయని కలెక్టర్ తెలిపారు.