calender_icon.png 13 February, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయమే.. వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్

03-05-2024 01:59:27 AM

3 ఎంఎల్‌డీ ప్లాంట్‌తో 20 వేల మందికి తాగునీరు 

పుప్పాలగూడ, మణికొండలో ప్రయోగాత్మకంగా అమలు

మరో మూడు చోట్ల  నిర్మాణానికి ప్రతిపాదలను

ఒక్కో ప్లాంట్  నిర్మాణానికి రూ. 1.50కోట్ల ఖర్చు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి): జలమండలి వర్టికల్ ట్రీట్మెంట్ వాటర్‌ప్లాంట్ మూడు మిలియన్ లీటర్లు(3ఎంఎల్‌డీ) నీటిని నిత్యం శుద్ధి చేసే 20వేల మంది వేసవి దాహాన్ని తీర్చనుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తాగునీటి సరఫరాకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జునసాగర్, గోదావరి, జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్‌సాగర్ నుంచి అందుతున్న సరఫరా కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలో వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను జలమండలి అమల్లోకి తీసుకొచ్చింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా నీటిని శుద్ధి చేసి అదనంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మణికొండ(3ఎంఎల్డీ), పుప్పాలగూడ(2ఎంఎల్డీ) నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. 

ఒక్కొప్లాంట్ ఏర్పాటుకు రూ.1.5కోట్లు

నగరంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో ప్లాంట్‌ను నిర్మించేందుకు రూ. 1.50కోట్లు ఖర్చవుతున్నదని జలమండలి అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండుచోట్ల ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండటంతో మూడు చోట్ల గండిపేట కాలువ, కోకాపేట, పుప్పాల్‌గూడలో వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ల ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేశారు. 

అదనంగా తాగునీటి సరఫరా  దశరథరెడ్డి (సీజీఎం సర్కిల్) 

 జలాశయాల నుంచి వచ్చే సరఫరా కాకుండా అదనంగా వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్లలో ప్రత్యేకంగా శుద్ధిచేసి ప్రజల దప్పిక తీర్చుతున్నాం. ఉస్మాన్‌సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఆసిఫ్‌నగర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో        శుద్ధి చేసి పంపిస్తుండగా అదనంగా నీటిని తీసుకొచ్చి ఈ వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాం. ఇసుక, యాక్టివేటెడ్ కార్బన్ మిశ్రమంతో నిర్దేశించిన స్థలంలో వర్టికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చు. వేసవితో పాటు ఇతరత్రా అత్యవసర సమయాల్లో అత్యాధునిక పద్ధతుల్లో ఈ ప్లాంట్ల తో వేసవిలో తాగునీటి కష్టాలను అధిగమించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.