03-04-2025 11:09:55 PM
పటాన్ చెరు/గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో 930 గ్రాముల ఎండుగంజాయి, ఒక తపంచా నాటు తుపాకిని గుమ్మడిదల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిన్నారం సీఐ నయీమొద్దీన్ గురువారం సాయంత్రం గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన భూపేంద్ర కుమార్ శర్మ, మిథున్ ఆరు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం దోమడుగు గ్రామానికి వచ్చి బొంతపల్లి పారిశ్రామిక వాడలోని శ్యామ్ పిస్టన్స్ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
వచ్చే జీతం సరిపోక ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో భూపేందర్ కుమార్ శర్మ, మిథున్ లు అప్పుడప్పుడు బీహార్ నుంచి ఎండు గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ఇక్కడ అమ్మి డబ్బు సంపాదించేవారు. గంజాయి అమ్మే క్రమంలో ఎవరైనా అడ్డువస్తే వారిని బెదిరించడానికి గత అక్టోబర్ నెలలో భూపేంద్ర కుమార్ శర్మ బీహార్ నుంచి ఒక తపంచాను కొనుగోలు చేసి దోమడుగులోని తన గదిలో దాచాడు. మిథున్ ఇటీవల బీహార్ వెళ్లి రైలులో ఎండు గంజాయిని తీసుకువచ్చి భూపేంద్ర కుమార్ శర్మకు ఇవ్వగా దానిని తన గదిలో భద్రపరిచాడు.
కాగా విశ్వసనీయంగా వచ్చిన సమాచారం మేరకు గురువారం గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి దోమడుగు గ్రామంలోని భూపేంద్ర కుమార్ శర్మ ఉండే గదిని తనిఖీ చేయగా 930 గ్రాములు ఎండు గంజాయి, ఒక తపంచా నాటు తపాకి, గంజాయిని ప్యాకింగ్ చేయడానికి వాడే మిషన్, హీటింగ్ మిషన్, గంజాయి రవాణాకు ఉపయోగించే బైకును, అతని సెల్ ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారు. భూపేందర్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ నయీముద్దీన్ తెలిపారు. మిథున్ తో పాటు రోహిత్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.