calender_icon.png 9 February, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్కడ ఎండబెట్టి.. అక్కడ నానబెట్టి!

09-02-2025 12:00:00 AM

  1. జనగామ మండలంలో కరువు ఛాయలు
  2. ఇక్కడి నీళ్లు ఆలేరుకు తరలింపు
  3. జనగామలో ఎండిపోతున్న పంటలు

జనగామ, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): జనగామ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు ఆలేరు ప్రాంతానికి వెళ్తుండటంతో కొన్ని గ్రామాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో గల జలాశయాల నీరు పక్క జిల్లాలకు తీసుకెళ్లి.. తమకు అన్యాయం చేస్తున్నారని ఇక్కడి రైతులు వాపోతున్నారు.

వరినాట్లు వేశాక పంట ఎదిగే క్రమంలో నీళ్లు అందడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూసి కొందరు రైతులు కనీసం దుక్కులు కూడా దున్నలేదు. జనగామ, బచ్చన్నపేట మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

ఈ మండలాలకు ప్రతీ వ్యవసాయ సీజన్‌కు నియోజకవర్గంలోని బొమ్మకూరు, మల్లన్నగండి రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా నీటిని వదులుతారు. ఈ యాసంగికి కాల్వల ద్వారా నీరు వదలకపోగా.. ఆ డ్యాముల్లోని నీటిని చేర్యాల నియోజకవర్గంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి ఆలేరుకు నీటిని వదులుతున్నారు. 

తపాస్‌పల్లికి ఎత్తిపోస్తూ..

ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లన్నగండి రిజర్వాయర్‌లో నీటిని నింపుతున్న అధికారులు అక్కడి నుంచి బొమ్మకూరు రిజర్వాయర్‌కు పంపుతున్నారు. బొమ్మకూరు జలాశయం కుడి కాలువ ద్వారా బచ్చన్నపేట, జనగామ మండలాలకు నీరు అందించాల్సి ఉంటుంది. ప్రతీ సీజన్‌కు ఈ కాలువ ద్వారా వచ్చే నీటిపై ఆధారపడే రెండు మండలాల రైతులు వ్యవసాయం చేస్తున్నారు.

కానీ ఈసారి ఇక్కడి పాలకుల నిర్లక్ష్యం వల్ల కుడి కాలువకు నీళ్లు వదలకుండా బొమ్మకూరు జలాశయంలోని నీటిని నేరుగా కొమురవెల్లి దగ్గరలో గల తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు. ఆ రిజర్వాయర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలోని పంటలకు నీరందిస్తున్నారు. ముందుగా స్థానిక రైతులకు సరిపోను నీటిని అందించాక..

అక్కడికి పంపింగ్ చేయాల్సి ఉండగా.. ఇక్కడి పంటలను ఎండబెడుతూ పక్క జిల్లాకు నీరు అందించడంపై అసహనం వ్యక్తం చేశారు. బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా ఉన్నందునే తన నియోజకవర్గానికి నీరు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ యాసంగిలో జనగామ మండలంలో 19,300 ఎకరాల్లో, బచ్చన్నపేట మండలంలో 24 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలోనే అధికంగా వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఈ రెండు మండలాలే టాప్‌లో ఉండడం విశేషం. కానీ కాలువల ద్వారా నీరు రాకపోవడంతో ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి. 

అడుగంటిన భూగర్భజలాలు

జనగామ నియోజకవర్గంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలకు కాల్వల ద్వారా నీరు రాకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడుతున్నారు. కానీ భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్లలో కూడా నీళ్లు పడడం లేదు. 500 ఫీట్ల లోతుకు మించి బోర్లు వేసినా ఫలితం కనిపించడం లేదు. 

నేతల వింత సమాధానాలు

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇటీవల వేర్వేరుగా పలు గ్రామాలకు కాల్వల ద్వారా నీటిని వదిలారు. జనగామ మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల రైతులు తమకు కాల్వల ద్వారా నీటిని వదలాలని పల్లాతో పాటు కొమ్మూరిని కోరగా వారు వింత సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

తనను గెలిపించనప్పుడు తాను ఎందుకు పనిచేస్తానని కొమ్మూరి సమాధానం ఇచ్చారని రైతులు వాపోయారు. ఎమ్మెల్యే పల్లాకు సమస్యను వివరించగా మీ గ్రామంలో ఎక్కువగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, వారినే నీళ్లు అడగాలని చెప్పినట్లు తెలిసింది. ఇలా ఇద్దరు లీడర్ల వైఖరితోనూ రైతులు బాధపడుతున్నారు.

బోరు వేస్తే నీళ్లు పడలే

మాకు ప్రతీసారి కాల్వ  ద్వారా పొలాలకు నీరు అందేది. నీటి సౌలతు ఉం  ఆశతో 12 ఎకరాల్లో వరి సాగు చేశా. నాట్లు వేశాక నీళ్లు లేక పంట ఎదగడం లేదు. ఈసారి బొమ్మకూరు నుంచి కాలువ ద్వారా నీళ్లు రావడం లేదు. పంటను కాపాడుకునేందుకు 500 ఫీట్ల బోరు వేస్తే సన్నగా పోస్తుంది. 12 ఎకరాల పంట ఎండిపోయేటట్టు ఉంది. ఇప్పటికైనా బొమ్మ  నుంచి నీళ్లు విడుదల చేయాలి.

 కుషాకర్, రైతు, వడ్లకొండ