calender_icon.png 24 December, 2024 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తడుస్తున్న ధాన్యం.. తల్లడిల్లుతున్న రైతులు

02-11-2024 02:44:31 AM

కొర్రీలు పెట్టి ధాన్యం కొనేందుకు ససేమిరా

పంటను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు

గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్న వైనం

కామారెడ్డి/ సిరిసిల్ల/మంథని, నవంబర్ 1(విజయక్రాంతి): అహర్నిశలు పంటను పండించిన రైతులు అష్టకష్టాలు పడి  దిగుబడిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కాంటాలు వేసే నాథుడే లేడు. దర్జాగా పంటను అమ్ముకుని తమ కడగండ్లను తీర్చుకుందామని ఆశపడితే రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారు. సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్వాహకులు, సిబ్బంది లేనిపోని కొర్రీలు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

దీంతో  రైతులు రోజుల తరబడి ధాన్యాన్ని కేంద్రాల్లోనే ఉంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  ఈనెలలో ఇప్పటికే నాలుగుసార్లు ఆకాల వర్షం కురిసింది. కొన్నిచోట్ల ధాన్యం తడవగా, రైతులు ఎండలు రాగానే తిరిగి ధాన్యాన్ని ఎండబెట్టుకున్నారు. తాజాగా మళ్లీ వానలు కురుస్తున్నాయి. తిరిగి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని మంథని శివారులోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టి ధాన్యం శుక్రవారం తడిసింది. ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో  నెలరోజుల ముందుగానే పంట చేతికొచ్చింది. దీనిని గమనించి ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. దళారులు ఇంటికి, కల్లాలకు వచ్చి మరీ కొంటుండడంతో రైతులు తక్కువ ధరకైనా తలొగ్గి పంటను విక్రయించారు.

ధరలు ఇలా..

ప్రభుత్వం మొదటి రకం పత్తి క్వింటాకు రూ.7,521, రెండో రకం పత్తికి రూ.7,121 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కాగా దళారులు క్వింటాకు రూ.5,900 నుంచి రూ.6,100 వరకే చెల్లించి రైతుల నుంచి ధాన్యం కొంటున్నారు. అంతేకాకుండా బస్తాకు తరుగు పేరిట 3 కిలోల వరకు కోత విధిస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే, అది ఆంతేనని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. తూకాలకు కొత్త ఆధునిక యంత్రాలు ఎన్నో అందుబాటులో ఉండగా, దళారులు పాత కాంటాలతోనే తూకాలు వేసి రైతులను మోసం చేస్తునానరు.

సాధారణంగా తునికలు, కొలతల శాఖ బాట్లకు ముద్ర వేసిన తర్వాత కొనుగోళ్లు చేపట్టాల్సి ఉండగా, అలాంటి నిబంధనలు పాటించకుండా దళారులు రైతులను నిండా ముంచుతున్నారు. ఇప్పటికైనా తూనికలు, కొలతలశాఖ అధికారులు పల్లెల్లో తనిఖీలు  చేపట్టి, తూకంలో మోసాలకు పాల్పడుతున్న దళారుల పనిపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించి, ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.