calender_icon.png 20 September, 2024 | 5:57 PM

ఎయిర్‌పోర్ట్ కల కల్లేనా?

20-09-2024 12:42:01 AM

  1. నెరవేరని భద్రాద్రి జిల్లావాసుల ఆకాంక్ష
  2. స్థలం సేకరణపై నాలుగేళ్ల క్రితం హడావుడి
  3. రెండుచోట్ల స్థల పరిశీలన.. ఆ తర్వాత అటకెక్కిన ప్రతిపాదన
  4. తాజాగా మంత్రి తుమ్మల చొరవ.. చిగురిస్తున్న ఆశలు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): పారిశ్రామిక వాడ పాల్వంచ, రాముడు నడయాడిన నేల భద్రాచలం, సింగరేణి గనులకు కేరాఫ్ కొత్తగూడెం, ఇల్లెందు.. ఇలా భద్రాద్రి జిల్లా ఒక ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ప్రాంతం. పారిశ్రామికరణ చెందిన ప్రాంతం. పాల్వంచ మండలంలో కేటీపీఎస్, నవభారత్, ఎన్‌ఎండీసీ, సారపాకలో ఐటీసీ, మణుగూరు ప్రాంతంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడు ప్రాంతాల్లో సింగరేణి, అశ్వాపురంలో భారజల కేంద్రం..

ఇలా ఎన్నో పరిశ్ర మలకు ఆలవాలం. ఆధ్యాత్మికంగా ప్రాశ స్త్యం ఉన్న నేల. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఉంటే బాగుంటుందని జిల్లావాసుల ఆకాంక్ష. వాటికి అనుగుణంగా నాటి కొత్తగూడెం ఎమ్మెల్యే జల గం వెంకట్రావు ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తే బాగుటుందని యోచించారు. అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం చేశారు. నాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు కొత్త ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించగా, వాటిలో కొత్తగూడెం పేరు కూడా ఉన్నది. మిగతావి వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, బసంత్‌నగర్, దేవరకొండ. 

రెండు చోట్ల స్థల పరిశీలన..

సర్కార్ ఆదేశాల మేరకు జిల్లాయంత్రాంగం, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ అధికారులు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని మైలారంలో ఓ స్థలాన్ని సైతం పరిశీలించింది. ఆ స్థలం వన్యప్రాణి సంరక్షణ విభాగంలో ఉండడంతో ప్రతిపాదనకు ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత అధికారులు పాల్వంచ పట్టణంలోని బంగారుజాలు, పేటచెరువు ప్రాంతంలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆరు నెలల్లో అక్కడ ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభమవుతాయని అందరూ భావించారు. ప్రైమరీ సర్వే సైతం పూర్తయింది. హై ఫ్లడ్ లెవల్ పరిస్థితిని వివరించాలంటూ ఎయిర్‌పోర్టు అధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరింది. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ నివేదికను సైతం సిద్ధం చేసింది. నివేదికపై ఎయిర్‌పోర్ట్ అధికారులు సైతం సంతృప్తి చెందారని తెలిసింది. కానీ, చివరకు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు మాత్రం అడుగులు పడలేదు. 

పట్టింపు లేని ప్రజాప్రతినిధులు, అధికారులు

తెలంగాణ వచ్చిన కొత్తలో నాటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం కొంత కృషి చేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఎయిర్‌పోర్ట్ ఊసే ఎత్తలేదు. ఆ ప్రతిపాదన గురించి ఎక్కడా మాట్లాడనూ లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఆయన ఇక ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తగూడేనికి ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి పాల్వంచ శివారులోని స్థలం ఎయిర్‌పోర్ట్‌కు అనకూలమని, కానీ ఆ ప్రాంతంలో బడాబాబులకు చెందిన భూములు ఉండడంతోనే.. వారు ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్ రాకుండా చూస్తున్నారనే వాదనలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.