- పథకానికి బడ్జెట్‌లో రూ.9,184 కోట్లు కేటాయింపు
- సర్కార్ లక్ష్యం మాత్రం 4.50 లక్షల ఇండ్లు
- లక్ష్యం నెరవేరాలంటే రూ.22,500 కోట్లు అవసరం
- కేంద్రం నిధులపై ఆశలు..? రాష్ట్రప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ‘ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇస్తాం.. లేదా ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికయ్యే వ్యయాన్ని దశలవారీగా అందిస్తాం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇళ్ల చొప్పున 4.50 లక్షల ఇండ్లు నిర్మిస్తాం. వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఇండ్లు , పట్టణ ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు నిర్మిస్తాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని గొప్పలు చెప్పింది.
తీరా బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇంటి పథకానికి రూ.9,184 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపు కొన్నది. ఆ నిధులు కనీసం పునాదులు నిర్మించేందు కైనా సరిపోవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున కేటాయించినా, 4.50 లక్షల ఇండ్లు పూర్తి చేయాలంటే రూ.22,500 కోట్లు ఖర్చవుతుంది. కానీ రాష్ట్రప్రభుత్వం కేవలం రూ.9,184 కోట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులు ఒక్కొక్కరికీ రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు అంతంతమాత్రంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై ఆశావహులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పీఎం ఆవాస్ యోజన (ఆర్బన్), పీఎం ఆవాస్ యోజన (రూరల్ ) పథకాల ద్వారా రూ.7,117.55 కోట్ల నిధులు కేంద్రం నుంచి వస్తాయని, దీనికి తోడు హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్లు, హడ్కో ద్వారా మరో రూ.1,150 కోట్ల రుణం సమీకరించుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఇలా..
పట్టణ ప్రాంతాల్లో 400 చదర పు అడుగుల విస్తీర్ణంలో ఆర్సీసీ కప్పుతో ఒక వంట గది, ఒక టాయిలెట్ నిర్మించే అవకాశం ఉండదు కాబట్టి అధికారులు గ్రూప్ హౌసిం గ్, అపార్ట్‌మెంట్లను నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీ ణ ప్రాంతాల్లో మాత్రం స్థలం ఉన్నవారు ఇండ్లు నిర్మించుకునే అవకాశం ఉన్నది. అందుకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుంది. కేంద్రం రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని గరిష్ఠంగా 2 లక్షల వరకు ఇండ్లు మంజూరు చేసే అవకాశం ఉన్నది. వాటిలోనూ ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల నుంచి 2.5 లక్ష లు మాత్రమే విడుదల చేస్తుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంతా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లోనే ఉంటుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వ జో క్యానికి ఆస్కారమే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మించాలని పూనుకోవడం, కేంద్రం నుంచి నిధులను ఆశించడం నిరర్థకమనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.