calender_icon.png 24 September, 2024 | 7:54 AM

వ్యర్థాల తొలగింపునకు డ్రా టెండర్లు

20-09-2024 12:00:00 AM

  1. ఏడాది కాలానికి బిడ్స్ నోటిఫికేషన్ జారీ 
  2. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ 
  3. నేటి నుంచి 27 వరకు అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 19 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఆక్రమణ లకు గురైన చెరువులు, నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణలపై ఆపరేషన్‌ను మరింత ముమ్మరంగా, వేగంగా చేయనుంది. జూలై 19న ఏర్పాటైన హైడ్రా.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.

అయితే, ఈ రెండు నెలల కాలంలో నిర్వహించిన ఆక్రమణల తొలగింపు వాహనాలను అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆక్రమణల కూల్చివేతల అనంతరం వ్యర్థాలను కూడా తొలగించాల్సి రావడంతో ఇటు కూల్చివేతలకు, ఆ తర్వాత తొలగించిన భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు హైడ్రా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలం ఎంగేజ్ కోసం ప్రత్యేక వాహనాలు కావాలంటూ, అర్హులైన వాహనదారుల నుంచి దరఖాస్తులు కోరుతూ హైడ్రా గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

27 వరకు అవకాశం.. 

గ్రేటర్ వ్యాప్తంగా హైడ్రా అధికారులు రెండు నెలల్లో 23 ప్రాంతాలలో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు చెందిన వ్యర్థాలు ప్రస్తుతం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాస్తవానికి ఈ వ్యర్థాలను సంబంధిత నిర్మాణదారులు తొలగించుకోవాల్సి ఉంది. కానీ, వారు తొలగించుకోకుంటే ఆ వ్యర్థాలను తొలగించి అందుకయ్యే ఖర్చును భవన నిర్మాణదారుల నుంచే వసూలు చేస్తామని హైడ్రా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి హైడ్రాకు ఇంకా పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేదు.

ప్రభుత్వం హైడ్రాకు కేటాయిస్తానన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించకుంటే, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కి చెందిన పాత ఈవీడీఎం సిబ్బంది, విజిలెన్స్ అధికారులను కూడా హైడ్రా అధికారులు వినియోగించుకుంటున్నారు. క్రమేపీ హైడ్రా తన సొంత వ్యవస్థను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇప్పటి వరకు ఆక్రమణల కూల్చివేతలకు బయట నుంచే భారీ వాహనాలను వినియోగించిన హైడ్రా.. ఇక ఏడాది కాలం పాటు భారీ వాహనాలను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగించుకోవడానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆఫ్‌లైన్ ద్వారా సీల్డ్ కవర్లతో ఈ బిడ్లను ఈ నెల 20 నుంచి 27 వరకు స్వీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు టెండర్ ఖరారు ఎంపిక కానుంది. అందుకు టెండర్ డాక్యుమెంట్‌ను directo rateofevdm.ghmc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. బిడ్ వేసేవారు కవర్ పైభాగాన టెండర్ రిఫరెన్స్ నంబర్, ప్రతిపాదనల స్వీకరణకు చివరి తేదీ రాసి సీల్డ్ కవర్లలో ప్రతిపాదన లను హైడ్రా కమిషనర్, బుద్ధ భవన్ 7వ అంత స్తు, రాణిగంజ్, సికింద్రాబాద్, 500003 అడ్రస్‌కు స్పీడ్ పోస్టు ద్వారా పంపాలని సూచించారు.