03-03-2025 01:01:57 AM
నిత్యం పాదచారులు, వాహనదారుల ఇక్కట్లు
పట్టించుకోని సీవరేజ్ బోర్డు అధికారులు
రాజేంద్రనగర్, (కార్వాన్) మార్చి 2 (విజయక్రాంతి): సుమారు వారం రోజులుగా డ్రైనేజీ నీళ్లు రోడ్డుపై పొంగిపొర్లుతున్న సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లంగర్ హౌస్ లోని ప్రధాన రహదారి సంగం ఆలయం తర్వాత అత్తాపూర్ వెళ్లే బ్రిడ్జి సమీపంలో ప్రధాన రోడ్డుపై డ్రైనేజీ నీళ్లు మడుగు గా మారింది. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పాదచారులతో పాటు వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న పండ్లవిక్రయదారులతోపాటు కొనుగోలుదారులు కూడా తీవ్రమైన దుర్వాసనతో ఇక్కట్లకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన సీవరేజీ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.