01-04-2025 12:25:17 AM
చేవెళ్ల, మార్చి 31: సాంప్రదాయ పంటలతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఈ పథకం కింద మునగ, కొబ్బరితో పాటు మామిడి, జామ, సీతాఫలం, నిమ్మ, దాని మ్మ, బత్తాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్ లాంటి పండ్ల తోటలకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇందుకోసం 50 నుంచి 60 శాతం సబ్సిడీ కూడా వర్తింపజేస్తోంది.
చేవెళ్ల మండలంలో ఈ అవకాశాన్ని వినియోగించుకున్న పలువురు రైతులు.. గత ఆర్థిక సంవత్సరంలో 14 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటలు సాగు చేశారు. ప్రభుత్వం చిన్న, సన్న కారు రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ...
రైతుల అవసరం మేరకు ఎకరాను 2 నుంచి 6 యూనిట్లుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. రైతులు పామెన, గుండాల, లక్ష్మిగూ డలో 7 యూనిట్లు, మల్లారెడ్డిగూడలో 1, పల్గుట్టలో 6, అల్లవాడలో 2, గొల్లపల్లిలో 2, కౌకుంట్లలో 3 .. మొత్తం 24 యూనిట్లుగా డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేశారు.
ఎకరాకు రూ.10 లక్షలు ఖర్చు
డ్రాగన్ ఫ్రూట్ సాగులో భాగంగా ఎకరాకు 18 వేల నుంచి 20 వేల మొక్కలు నాటుతారు. మొక్కలు, సిమెంట్ ఫోల్స్, రింగులు, ఎరువులకు కలిపి రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అయితే ప్రభుత్వం 5, 10, 20 గుంటలకు కూడా సబ్సిడీ అందిస్తుండడంతో రైతులు ముందుకు వస్తున్నారు. ఈ పంటకు నీటి అవసరం తక్కువ (బిందు సేద్యం వాడుతారు) కావ డం, మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వారికి కలిసి వస్తోంది.
మార్కెట్లో కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతున్న ఈ పంట.. ఒకసారి (పంట వేసిన రెండేళ్లకు) దిగుబడి మొదలయ్యాక 15 నుంచి 20 ఏండ్ల వరకు కొనసాగుతుంది. అంతేకాదు పెస్టిసైడ్స్ వాడకం కూడా పెద్దగా ఉండదు.. 2 నెలలకు ఒకసారి, పంట చేతికొచ్చే సమయంలో మరోసారి మాత్రమే పిచికారీ చేస్తారు. సిమెంట్ ఫోల్స్ పై సాగు కావడంతో కలుపు సమస్య కూడా పెద్దగా ఉండదు.
ఆదర్శంగా నిలుస్తున్న రైతు మల్లారెడ్డి
చేవెళ్ల మండలం అల్లవాడ గ్రామానికి చెందిన సామ మల్లారెడ్డి డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రెండేళ్ల కింద సొంతంగా పెట్టుబడి పెట్టి ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ వేశాడు. ఎకరాకు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టగా... దిగుబడి వచ్చిన తొలి యేడాదే 18 టన్నుల దిగుబడి రాగా.. రూ. 13 లక్షల అమ్మకాలు చేశాడు. అంటే ఒక్క పంటలోనే పెట్టుబడి వచ్చేసింది.
దీంతో గతేడు ఈజీఎస్ కింద మరో రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేశాడు. ఈ పంటతో పాటు మ్యాంగో స్టీన్, మెకడామియా, ఆవకాడో లాంటి విదేశీ ఫలాలు కూడా సాగు చేస్తుండడం విశేషం. తాను హైదరాబాద్లోని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో ఫలాలు విక్రయిస్తున్నానని, సీజన్ను బట్టి ధర పలుకుతుందని చెబుతున్నాడు. తెలిసిన వ్యాపారులు నేరుగా తన వద్దకేపండ్లను కొంటారని వెల్లడించాడు.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం ఈజీఎస్ కింద సబ్సిడీ అందిస్తోంది. గత ఏడాది పలువురు రైతులు సబ్సిడీ వినియోగించుకొని 14 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ఈ సారి మరింత మంది ముందుకొస్తే.. తప్పకుండా ప్రోత్సాహం అందిస్తాం. ఈ పథకం కింద అర్హత పొందాలంటే 5 ఎకరాల లోపు భూమి ఉండి.. జాబ్ కార్డు ఉంటే సరిపోతుంది. రైతులను కూడా గ్రామ సభ ద్వారానే ఎంపిక చేస్తాం.