calender_icon.png 6 November, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 అంశాలతో ముసాయిదా

03-08-2024 03:57:00 AM

  1. వ్యవసాయ భూములకు, ఆవాసాలకు వేరువేరుగా ఆర్వోఆర్ 
  2. భూ సమస్యల సవరణ, పరిష్కారానికి అవకాశం
  3. తహసీల్దార్లు, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్లకు బాధ్యతలు
  4. భూసర్వే తర్వాత శాశ్వత భూ ఆధార్  

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో నూతన ఆర్వోఆర్‌ేొ2024 ముసాయిదాను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ ముసాయిదాపై ప్రజాభిప్రాయం కోరుతూ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ప్రముఖ భూ చట్టాల నిపుణులు భూమి సునీల్‌కుమార్ దేశంలోని 18 రాష్ట్రాల భూ చట్టాలను అధ్యయనం చేసి సుమారు 20 అంశాలతో 23 పేజీల్లో ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.

కేంద్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాలకు లోబడి రూపొందించిన ఈ ముసాయిదాలో ప్రతి భూ కమతానికి ఒక యూఎల్‌పిన్ (భూకమతాలకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య)ను ఇవ్వడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే భూ సర్వేలకు ప్రభుత్వం నిధులు రాబట్టడంతోపాటు భూ రికార్డుల సవరణ క్షేత్రస్థాయిలోనే జరిగేలా దీనిని రూపొందించారు. దేశంలో గతంలో వచ్చిన భూ సంస్కరణల కంటే మెరుగైన, సులభరతమైన సేవలతో పొందుపర్చిన ఈ ముసాయిదాలో ప్రతి భూ సమస్యను తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్‌స్థాయి లోనే పరిష్కారం అయ్యోలా రూపొందించారు. వీటిపై రివిజన్ చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వానికి కల్పించారు.

ప్రధాన అంశాలు

  1. రిజిస్ట్రేషన్లతోపాటు మ్యుటేషన్ ప్రక్రియలో మూడు నిబంధనలు పేర్కొన్నారు. ఇందులో ఒక సెక్షన్ రిజిస్ట్రేషన్ కోసం కాగా, మరో రెండు సెక్షన్లు మ్యుటేషన్‌కు సంబంధించినవి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకేచోట జరుగుతుంది. కానీ మ్యుటేషన్ మాత్రం వెంటనే కాదు. ఇందులో రిజిస్ట్రేషన్, వారసత్వం, మార్టిగేజ్, గిఫ్ట్‌డీడ్ వంటి మ్యుటేషన్ల బాధ్యతను తహసీల్దార్ స్థాయిలో చేస్తారు. కోర్టు ఆర్డర్లు, అవార్డ్ ఆఫ్ లోక్ అధాలత్, సేల్ సర్టిఫికెట్, 13బీ, ఓఆర్సీ, 38ఈ, లావుణి భూములకు సం బంధించిన మ్యుటేషన్‌ను మాత్రం ఆర్డీవో చేయాలి. అయితే తహసీల్దార్లు, ఆర్డీవోలు కూడా నిర్ణీత గడువులోపు క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాతే మ్యుటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్ల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. వివాదాస్పద, ప్రభుత్వ భూములపై రిజిస్ట్రేషన్ జరిగినా మ్యుటేషన్ కాదు కాబట్టి వివాదాస్పద భూములకు రికార్డు ఆఫ్ రైట్‌ఛౌ వర్తించదు. 
  2. స్థాయిని, సమస్యను బట్టి ధరణితోపాటు ధరణిలో నమోదు కాని భూములకు, రెవెన్యూ రికార్డుల సవరణ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు కల్పించారు. ఈ నిబంధనలు గతంలో ఉన్నాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ మాత్రం ఈ అవకాశం లేదు. 
  3. భవిష్యత్తులో భూముల రీ సర్వే జరిగితే కొత్తగా మళ్లీ నూతన ఆర్వోఆర్‌ను రూపొందించుకొనే అవకాశం కూడా ప్రస్తుత ఆర్వోఆర్ ముసాయిదాలో కల్పించారు.
  4. వ్యవసాయేతర ఆబాది భూములకు (గ్రామ కంఠాలు) కూడా ప్రత్యేకమైన ఆర్వోఆర్ తయారు చేయనున్నారు. ఈ ఆబాది ఆర్వోఆర్ ప్రకారం నమోదు చేసిన రికార్డు ఆధారంగా ఆవాసాలకు ఓనర్‌షిప్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఒకసారి ఇవి జారీ అయిన తర్వాత వాటిని రిజిస్ట్రార్లు మాత్రమే మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఆవాసాల రిజిస్ట్రేషన్ జరుగదు. నాన్ అగ్రికల్చర్ భూములను కూడా మ్యుటేషన్ చేస్తారు. దీంతో ఆబాది భూములకు ప్రత్యేకంగా ఓ రికార్డు నమోదు అవుతుంది. అయితే మ్యుటేషన్‌లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ చట్టం ఆధారంగానే అప్పీలుకు వెళ్లవచ్చు. ఇప్పటి వరకు నాన్ అగ్రికల్చర్ భూములకు అప్పీల్ చేసుకునే అవకాశమే లేదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ ముసాయిదాలో అవకాశం కల్పించారు. అలాగే ప్రతి రెవెన్యూ గ్రామానికి నూతనంగా సర్వే మ్యాపులు కూడా అందు బాటులోకి వస్తాయి. 
  5. భవిష్యత్తులో ప్రతి భూ కమతానికి భూధార్‌ను ఇస్తారు. యూనిక్ ల్యాండ్ పార్సిల్ నంబర్ ఇస్తారు. ప్రస్తుతం తాత్కాలిక భూధార్, సర్వే పూర్తయిన తర్వాత శాశ్వత భూధార్ ఇవ్వనున్నారు. 
  6. భవిష్యత్తులో భూమి రిజిస్ట్రేషన్ జరగాలంటే సబ్ డివిజన్ సర్వే మ్యాపు ఉండాలి. సబ్ డివిజన్ సర్వే మ్యాపు లేకుంటే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయరు. కానీ సర్వే పూర్తయిన తర్వాతే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో భూ తగాదాలు పూర్తిగా తగ్గుతాయి. 
  7. అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫస్ట్ అప్పీల్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సెకండ్ అప్పీల్ మాత్రం సీసీఎల్‌ఏకు చేసుకోవాలి. దీంతో హైకోర్టు, సివిల్ కోర్టుకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గుతుంది. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సీసీఎల్‌ఏ తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వానికి రివిజన్ చేసే అధికారం ఉంటుంది. ఇనాం, అసైన్‌మెంట్, టెనెన్సీ వంటి వాటికి సంబంధించి ఆర్డీవో స్థాయిలో వాయిదాలు జరుగుతాయి.
  8. తప్పుగా నమోదైన వివరాలను సవరించే అధికారం క్షేత్రస్థాయి విచారణ అనంతరం చేసేలా అధికారులకు అవకాశం కల్పించారు.
  9. ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ రికార్డును కూడా పట్టాదారుకు అందించనున్నారు. 
  10. ప్రతి విలేజ్ రెవెన్యూ రికార్డుపై రివిజన్ కోరుతూ అప్పీల్ చేసుకునే వెసులు బాటు ఈ ముసాయిదాలో ఉంది.

సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో ముసాయిదా

ఆర్‌ఓఆర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త ఆర్‌ఓఆర్ బిల్లు ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమైన్‌లో పెడుతున్నట్లు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రజల నుంచి సలహాలు,  సూచనలు స్వీకరించేందుకు సీసీఎల్‌ఏ వెబ్ సైట్  (www.ccla. telangana. gov.in), http:// www.ccla. telangana.gov.in)? అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ నెల 23వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana. gov.in <mailto: ror2024-rev@ telangana. gov.in>) ద్వారా పంపించాలి. పోస్ట్ ద్వారా కూడా సీసీఎల్‌ఏ కార్యాలయానికి పంపించవచ్చు. ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబిడ్స్, హైదరాబాద్ 500001.