07-03-2025 01:31:41 AM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్
మంచిర్యాల, మార్చి 6 (విజయక్రాంతి) : 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేతనాల నిర్ణయం అశాస్త్రీయంగా చేశారని, పాత విడిఏను ప్రస్తుతం పొందుతున్న వేతనంలో కలిపారే తప్ప కొత్త డ్రాఫ్ట్ జీఓలలో నయా పైసా పెంచలేదన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన డ్రాఫ్ట్ జీఓలను సవరించాలని, కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలన్నారు. జిల్లాలో బీడీ కార్మికులు వివిధ మండలాల్లో సుమారు 3000 మంది ఉన్నారని, వీరికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్‌ఐ, కనీస వేతనం లేదని, అదే విదంగా జిల్లాలో సింగరేణిలో 7 వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ విభాగాలలో పని చేస్తున్నారన్నారు.
వీరికి కోల్ ఇండియా అగ్రిమెంట్ ప్రకారం హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయడం లేదని, సింగరేణి యాజమాన్యం పంపిన లేఖ ప్రకారంగా జీవో నెంబర్ 22ను సింగరేణిలో అమలు చేసుకోవడానికి అనుమతులు కూడా ఇవ్వడం లేదన్నారు. సింగరేణి, రైల్వే, జైపూర్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
జిల్లాలో ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ , హోటల్లో,రెస్టారెంట్లు, రైస్ , జిన్నింగ్ మిల్లులు, భవన నిర్మాణం, ట్రాన్పోర్ట్, బ్రేడ్, కార, సిమెంటు ఉత్పత్తి పరిశ్రమలు, టైల్స్ ఉత్పత్తి కేంద్రాలు , ఇటుక బట్టీలు మరియు సంఘటిత రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, డైలీ వైజ్ కార్మికులందరూ కనీస వేతనం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి. ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం బ్రాంచ్ అధ్యక్షులు మహేందర్, బీడి కార్మికులు రాజన్న, రజిత, స్వరూప, రాజ్యలక్ష్మి, శిరీష, శ్రీలత, మానస, రజిత, తదితరులు పాల్గొన్నారు.