calender_icon.png 14 November, 2024 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ రెడ్డీస్ కన్సాలిడేటెడ్ లాభం రూ.1,342 కోట్లు

06-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 5: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 9 శాతం క్షీణించి రూ. 1,342 కోట్లకు తగ్గింది. నిరుడు క్యూ2లో కంపెనీ రూ. 1,480 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది.

తాజాగా ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ కన్సాలిడేటెడ్ ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,880 కోట్ల నుంచి రూ. 8,016 కోట్లకు పెరిగింది. అయితే కంపెనీ లాభం విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయింది.

డాక్టర్ రెడ్డీస్‌కు ప్రధాన మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో అమ్మకాలు వృద్ధిచెందినప్పటికీ, ధరల తగ్గుదలతో లాభాల్ని పెంచుకోలేకపోయింది. కంపెనీకి రెండో పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో రూ. 1,397 కోట్ల అమ్మకాల ఆదాయాన్ని సాధించింది. 

* ‘మరో పటిష్టమైన త్రైమాసిక పనితీరు ప్రదర్శించాం. తమ అన్ని వ్యాపార విభాగాల్లోనూ వృద్ధి జోరు కొనసాగింది. భవిష్యత్ వృద్ధి కార్యకలాపాల్లోనూ ప్రగతి సాధిస్తున్నాం. నెస్లేతో మా వెంచర్ ప్రారంభమయ్యింది. నికోటినెల్, సంబంధిత బ్రాండ్ల టేకోవర్ పూర్తి చేశాం’ - జీవీ ప్రసాద్, కో చైర్మన్, ఎండీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్