హైదరాబాద్ : సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు డా. పొన్నం రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బెంగుళూరు సుచిత్ర ఫిలిం సొసైటీలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో ఎఫ్ఎఫ్ఎస్ఎస్ఆర్ కార్యదర్శి బి.ఎస్.ఎస్ ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రెడ్డి ఎన్నిక పత్రాన్ని రవిచంద్రకు అందించారు.
గత మూడేళ్ళుగా సౌత్ రీజియన్ అసిస్టెంట్ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర కొన్నేళ్లుగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, అనేక సినీ వ్యాసాలు రాశారు. సీనియర్ జర్నలిస్ట్ గా, ఫిల్మ్ క్రిటిక్ గా సూపరిచితులైన రవిచంద్ర రాసిన ‘ప్రస్థానం’ సినీ గ్రంధము ఉత్తమ సినిమా గ్రంధంగా ఎంపికై నంది అవార్డు సొంతం చేసుకున్నారు. దాదాపు పదికి పైగా డాక్యుమెంటరీలు నిర్మించిన రవిచంద్ర బాలీవుడ్ నటులు పైడి జైరాజ్ పై రూపొందించిన డాక్యుమెంటరీ పలు ఇంటర్నేషనల్ వేదికలపై ప్రదర్శించబడి ఆరు అవార్డులను అందుకోగా, ఇటీవలనే వచ్చిన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ డాక్యుమెంటరీ పలువురి ప్రశంసలు పొందింది.
రవిచంద్ర ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎంపిక కావడం పట్ల కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి కె. లక్ష్మి గౌతమ్ తో పాటు సంస్థ సభ్యులు, ఫిల్మ్ క్రిటిక్ హెచ్. రమేష్ బాబు, పివి. రామ్మోహన్ రాయుడు, పిఎస్. రవీంద్ర, అక్షరయాన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, మాడిశెట్టి గోపాల్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, నంది శ్రీనివాస్, గాజుల రవీందర్, కె ఎస్ ఆనంతాచార్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.