* నోటిఫికేషన్ జారీ చేసిన క్యాబినెట్ నియామకాల కమిటీ
* జనవరి 14న బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ, జనవరి 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. నా రాయణన్‌ను ఇస్రోకు చైర్మన్‌గా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆయన పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. అదే రోజు నారాయణన్.. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన ఇస్రోలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
మారుమూల గ్రామంలో జన్మించి.. ఇస్రో చైర్మన్ స్థాయికి
డాక్టర్ వీ నారాయణన్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మెలకట్టు విలై అనే గ్రామంలో 1964లో జన్మించారు. 1984లో ఇస్రోలో ఉద్యోగం సంపాదించి నాలుగు దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పని చేశారు. ఇస్రోలో పని చేస్తూనే ఆయన 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి క్రయోజనిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు.
అనంతరం అదే ఇనిస్టిట్యూట్ నుంచి 2001లో స్పేస్ ఏజెన్సీ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్‌కు సంబంధించిన క్రయోజెనిక్ ప్రొపల్షన్ విభాగంలో పని చేశారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 వెహికిల్‌కు చెందిన సీ25 క్రయోజనిక్ ప్రాజెక్ట్‌కు నారాయణన్ డైరెక్టర్‌గా పని చేశారు.
ఆయన నాయకత్వంలోనే ఇస్రో బృందం విజయవంతంగా సీ25 స్టేజ్‌ను అభివృద్ధి చేసింది. జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 వెహికిల్ క్రయోజనిక్ ప్రాజెక్ట్‌లో సీ25 స్టేజి ముఖ్య భూమిక పోషించింది. నారాయణన్ నాయకత్వంలో ఎల్‌పీఎస్‌సీ.. ఇస్రో చేపట్టిన అనేక ప్రాజెక్ట్‌లకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌లను, కంట్రోల్ పవర్ ప్లాంట్లను అందజేసింది. ఆదిత్య చంద్రయాన్ చంద్రయాన్ చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారు.